![ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపిన కొడుకు..మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్‌బాడీ](https://static.v6velugu.com/uploads/2025/02/son-refuses-to-perform-last-rites-of-father-over-property-dispute-in-janagama-district_gLCt2lU1qA.jpg)
- జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో ఘటన
పాలకుర్తి (కొడకండ్ల), వెలుగు : ఆస్తి విషయం తేలే వరకు తండ్రి డెడ్‌బాడీకి అంత్యక్రియలు చేసేది లేదంటూ ఓ కొడుకు పట్టుబట్టాడు. మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్‌బాడీని పెట్టుకొని కూర్చున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వెలికట్టె యాదగిరి (55)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కొడుకు రమేశ్ ఉండగా రెండో భార్య పద్మకు కొడుకు ఉపేందర్, కూతురు శోభారాణి పుట్టారు. అయితే పద్మ కొడుకు ఉపేందర్ అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు.
యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా ఐదు ఎకరాలను రమేశ్ పేరున రిజిస్ట్రేషన్ చేసి, రెండు ఎకరాలను కట్నం కింద కూతురు శోభారాణి రాసి ఇచ్చి, మరో మూడు ఎకరాలు అమ్మి బంగారం పెట్టారు. మిగతా ఐదు ఎకరాలను రెండో భార్య పద్మ పేరిట రాశారు. అయితే పద్మ తన పేరున ఉన్న భూమిలో మూడు ఎకరాలను అమ్మి తన కూతురు శోభకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది. ఇదిలా ఉండగా... యాదగిరి అనారోగ్యంతో ఈ నెల 10న చనిపోయాడు.
దీంతో తన చిన్నమ్మ పద్మ పేరున ఉన్న మిగిలిన రెండు ఎకరాల విషయం తేల్చిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు చేస్తానని కొడుకు రమేశ్ పట్టుబట్టాడు. గ్రామస్తులు సైతం రమేశ్‌కే మద్దతు పలకడంతో మూడు రోజులుగా యాదగిరి డెడ్‌బాడీ ఇంటి ముందే ఉంది. చివరకు గ్రామస్తులు బుధవారం పద్మ, శోభతో మాట్లాడి వివాదాన్ని సెటిల్ చేశారు. దీంతో గురువారం యాదగిరి అంత్యక్రియలు జరపనున్నారు.