తల్లి పేరిట విరాసత్ ​చేయొద్దంటూ కొడుకు ఆత్మహత్యాయత్నం

తల్లి పేరిట విరాసత్ ​చేయొద్దంటూ కొడుకు ఆత్మహత్యాయత్నం
  • గడ్డి మందు డబ్బాతో తహసీల్దార్ ఆఫీస్​లో హల్‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌ 
  • కరీంనగర్ జిల్లా మానకొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో ఘటన

మానకొండూర్, వెలుగు: తండ్రి ఆస్తిని తల్లి పేరిట విరాసత్(సక్సేషన్) చేయొద్దంటూ కొడుకు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన కోహెడ లక్ష్మయ్య కొంతకాలం కిందట మరణించాడు. ఆయన పేరిట 4.12 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎకరం ప్రభుత్వ భూమిని మినహాయించి,  మిగతా 3.12 ఎకరాలను లక్ష్మయ్య భార్య రాజమ్మ తన పేరున విరాసత్ చేసుకునేందుకు ధరణి పోర్టల్ లో స్లాట్ బుక్ చేసుకుంది. 

ఆమెకు ముగ్గురు కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా.. తల్లి పేరిట విరాసత్ వద్దంటూ పెద్ద కొడుకు రవి గత శుక్రవారం తహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా కుటుంబ సభ్యులంతా కలిసి రావాలని సూచించారు. మంగళవారం విరాసత్ చేసుకునేందుకు రాజమ్మ ఆఫీసుకు వెళ్లగా రవి కూడా అక్కడికి చేరాడు. తల్లి పేరిట విరాసత్ వద్దంటూ అతడు గడ్డిమందు తాగుతుండగా..  స్థానికులు వెంటనే లాక్కునేందుకు యత్నించగా అతనిపై ఒలికి పడడంతో108కు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. 

దీనిపై తహసీల్దార్ బండి రాజేశ్వరిని వివరణ కోరగా.. నిబంధనల మేరకు భర్త ఆస్తిని భార్య పేరిట విరాసత్ చేయొచ్చన్నారు. అయితే.. రాజమ్మతో మాట్లాడగా ఇంకా ఇద్దరు బిడ్డల పెండ్లి చేయాల్సి ఉందని చెప్పారన్నారు. భర్త ఆస్తిని పిల్లల పేరిట చేస్తే తనను పట్టించుకోరని పేర్కొందన్నారు. కుటుంబసభ్యులంతా మాట్లాడుకుని రావాలని సూచించానని చెప్పారు. మంగళవారం వచ్చిన వారిలో రవి గడ్డి మందు తాగడానికి ప్రయత్నించాడని తెలిపారు.