మానవత్వమే లేని లోకం అనుకున్నాం ఇన్నాళ్లు.. ఇప్పుడు ఇంట్లో కన్న తల్లిదండ్రులపైనా కనీస కనికరం లేదని నిరూపితం అయ్యింది ఈ ఘటనతో.. ఒడిశా రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన.. దేశం మొత్తాన్ని కదిలిస్తుంది. కన్న తల్లిని.. సొంత కొడుకు హింసించిన విధానం.. కొట్టిన తీరు.. మనుషుల్లో విపరీత ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశా రాష్ట్రం కియోంధర్ జిల్లాలో శతృజ్ణ మహింతి అనే 39 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 60 ఏళ్లు పైబడిన వృద్ధ తల్లి ఉంది. కొన్నేళ్లు క్రితం పెద్ద కొడుకు చనిపోవటం.. ఆ తర్వాత చిన్న కొడుకు అయిన మహంతి.. తల్లిని ఇంటి నుంచి గెంటేయటం జరిగింది. దీంతో ఊర్లోని ఓ చిన్న ఇంట్లో జీవనం సాగిస్తూ.. ప్రభుత్వం ఇచ్చే రేషన్, పెన్షన్ సాయంతో జీవనం సాగిస్తుంది. డిసెంబర్ 20వ తేదీ కొడుకు పొలంలో ఉన్న క్యాలిఫ్లవర్ పంట చేతికి వచ్చింది. ఆ తల్లి చేతి ఖర్చుల కోసం.. పొలంలోని నాలుగు క్యాలిఫ్లవర్లను.. గ్రామంలో మరొకరికి విక్రయించింది. దీని ద్వారా వచ్చిన 80 రూపాయలతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసింది..
తన పొలంలోని నాలుగు క్యాలిఫ్లవర్లను తల్లి.. తనకు తెలియకుండా అమ్మిన విషయాన్ని తెలుసుకున్న కొడుకు శతృజ్ణ మహంతి.. తల్లిని.. నడి బజారులో తీవ్రంగా కొట్టాడు. అంతకీ కసి తీరక.. ఊర్లోని కరెంట్ స్తంభానికి తల్లిని కట్టేశాడు. ఆ తర్వాత ఆ తల్లిని తాడు, కర్రలతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనతో చలించిపోయిన చుట్టుపక్కల వారు.. మహంతిని తీవ్రంగా మందలించి.. ఆ వృద్ధ తల్లిని విడిపించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ఒడిశా పోలీసుల తీరుపై విమర్శలు రావటంతో.. రంగంలోకి దిగారు. గ్రామంలో విచారణ చేసి కేసు పెట్టారు. ఆ కొడుకును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వృద్ధ తల్లిని చక్కగా చూసుకోవాల్సిన కొడుకే.. ఇంట్లోని గెంటేయటం.. కేవలం నాలుగు అంటే నాలుగు క్యాలిఫ్లవర్లను పొలం నుంచి తీసుకున్నందుకు ఇంత తీవ్రంగా కొట్టటం చూస్తుంటే.. మానవత్వం లేకపోగా.. తల్లితో ఇలా ప్రవర్తించే కొడుకులు ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. నెటిజన్లు అయితే.. నీలాంటి కొడుకును కన్నందుకు ఆ తల్లి సిగ్గుపడుతుందిరా అంటూ తిట్టిపోస్తున్నారు.