73 ఏండ్ల తల్లితో కలిసి స్కూటర్ పై తీర్థయాత్ర

భైంసా, వెలుగు : నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ రుణం తీర్చుకునేందుకు ఓ కొడుకు ఆమెతో కలిసి తీర్థయాత్ర చేపట్టాడు. ఎప్పుడు ఇంటి వద్ద ఉంటూ.. బయటి ప్రపంచమే తెలి యని ఆ తల్లిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తూ రుణం తీర్చుకుంటున్నాడు. తండ్రి ఇచ్చిన స్కూటర్​పై తల్లితో కలిసి పర్యటిస్తున్నాడు. ఇప్పటికే 65,412 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకొని బుధవారం నిర్మల్​ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చాడు. 44 ఏండ్ల కృష్ణ కుమార్ స్వస్థలం కర్నాటకలోని మైసూర్. ఇతడి తండ్రి దక్షిణమూర్తి ఆరేండ్ల క్రితం చనిపోయాడు. తల్లి చూడరత్నమ్మకు ఇప్పుడు 73 ఏండ్లు. కృష్ణ కుమార్ బెంగుళూరులో సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్ గా పని చేసేవాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఆయన జ్ఞాపకాలతో బాధపడకూడదనుకుని ప్రముఖ ఆలయాలను చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి స్కూటర్​పై తీర్థయాత్రకు కదిలాడు. మాతృసేవ సంకల్ప యాత్ర పేరుతో 2018 జనవరి 15న మైసూర్​ నుంచి మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుపతి, కశ్మీర్​లోని పలు క్షేత్రాలతో పాటు నేపాల్, మయన్మార్​, భూటాన్​లోని ఆలయాలను కూడా దర్శించుకున్నారు.  తల్లిదండ్రులు దూరమైన తర్వాత వారి ఫొటోలకు పూలదండ వేసి మొక్కడం కంటే వారు ఉన్నప్పుడే సేవ చేసి తృప్తి పొందాలని కృష్ణకుమార్​అభిప్రాయపడ్డాడు. నాన్న ఇచ్చిన స్కూటర్​తో ప్రయాణిస్తుంటే నాన్న కూడా తమ వెంట ఉన్నారనే అనిపిస్తుందన్నారు. అయితే కృష్ణ కుమార్​ మాత్రం అవివాహితుడు.