హైదరాబాద్, వెలుగు: మోడర్నైజేషన్ ఇంజినీరింగ్ కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్, నల్గొండ ఐటీ టవర్‌లో త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఇక్కడ 200 మంది పనిచేస్తారని పేర్కొంది. తెలంగాణలోని టైర్- 2 పట్టణాల్లో విస్తరించడంలో భాగంగా ఈ సెంటర్‌ను ఓపెన్ చేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సోనాటా సాఫ్ట్‌వేర్ ఈవీపీ శ్రీని వీరవెల్లి భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం కేటీఆర్ అమెరికా నగరం బోస్టన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ టెక్నాలజీ ఇన్నోవేషన్‌పై దృష్టి సారిస్తూ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ వంటి పరిశ్రమల అవసరాలను తీరుస్తుందని సొనాటా ప్రకటించింది.
హైదరాబాద్‌లో స్టెమ్‌క్యూర్స్ ల్యాబ్
యూఎస్ ఆధారిత స్టెమ్‌క్యూర్స్ భారతదేశపు అతిపెద్ద స్టెమ్ సెల్ తయారీ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ఫెసిలిటీ కోసం సుమారు 54 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. రెండు దశల్లో సుమారు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. స్టెమ్‌క్యూర్స్ ఫౌండర్ డాక్టర్ సాయిరామ్ అట్లూరి కేటీఆర్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తీవ్రమైన వ్యాధులకు చికిత్స చేయడానికి అత్యంత నాణ్యమైన మూలకణ ఉత్పత్తులను తయారు చేస్తామని చెప్పారు. టాప్ 10 ఫార్మా కంపెనీలతో సహా 1000 లైఫ్ సైన్సెస్ కంపెనీలతో ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు హైదరాబాద్ నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఎదుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ " స్టెమ్ సెల్ థెరపీ ఎన్నో రకాల వ్యాధులకు ట్రీట్మెంట్లను అందజేస్తుంది. భారతదేశంలోని రోగులకు స్టెమ్‌క్యూర్స్ నాణ్యతతో కూడిన సంరక్షణను అందిస్తుందని అనుకుంటున్నాను. స్టెమ్ సెల్ థెరపీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కంపెనీతో కలిసి పనిచేస్తాం”అని ఆయన అన్నారు.
విస్తరణలో బాటలో సనోఫీ
తెలంగాణలో తమ పెట్టుబడులను మరింత పెంచుతామని, బిజినెస్‌లను విస్తరిస్తామని--- గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సనోఫీ లీడర్‌షిప్ టీమ్ మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా తెలియజేసింది. హైదరాబాద్‌లో 350 ఉద్యోగాలతో సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోప్రకటించింది. హైదరాబాద్ సెంటర్ తమ గ్లోబల్ ‘టాలెంట్ హబ్స్’లో ఒకటని తెలిపింది.