కరీంనగర్ జిల్లా: వ్యవసాయ పనులు చేసేటప్పుడు కష్టం తెలియకుండా పాటలు పాడుతూ పని చేస్తుంటారు. వరినాట్లు వేస్తూ బతుకమ్మ , పల్లెటూరి జానపద పాటలు పాడుతుంటారు. కూలీలంతా ఒకే వరుసలో నాట్లు వేస్తూ పాటలు పాడుతుంటే ఎంతో దూరం వినిపిస్తుంది. ఒకరు పాడుతుంటే .. మిగతా మహిళలంతా కలిపి రాగాలు తీస్తారు. ఇదంతా ప్రతి గ్రామాల్లోని వ్యవసాయ పనుల్లో జరగడం కామన్. తీరొక్క పాటలతో తమను తాము మైమరిచి సంతోషంలో మునిగిపోతుంటారు. ఈ క్రమంలోనే పని చేస్తున్నట్లు అనిపించదు.. ఆ రోజు ఇట్టే గడిచిపోతది. వారు పాడే పాటలు.. రకరాలుగా సొంత కవిత్వంతో ఆకట్టుకుంటాయి. తెలంగాణ యాసలో ఉంటాయి.
సీఎం కేసీఆర్ సర్కార్ తీరుపై ఉయ్యాల పాటలు
ఇదిలా ఉంటే.. ఓ వ్యవసాయ పొలంలో నాట్లు వేస్తు పాడిన పాట హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ సర్కార్ తీరుపై ఉయ్యాల పాట పాడుతూ తమ కష్టాలను పాట రూపంలో తెలిపారు. రైతులు, రైతు కూలీల కష్టాలు, ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యాలను తెలుపుతూ పాడారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మామిడాలపల్లి గ్రామంలో జరిగింది. మహిళలంతా వరినాట్లు వేసుకుంటూ సర్కార్ పై పాట పాడగా.. అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీశాడు. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండగా.. కేసీఆర్ సర్కార్ తీరుపై మహిళలు చాలా చక్కగా పాడారంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.