మాతృ వందన స్కీమ్​పై నిర్లక్ష్యం.. కేంద్రంపై సోనియా గాంధీ విమర్శ

మాతృ వందన స్కీమ్​పై నిర్లక్ష్యం.. కేంద్రంపై సోనియా గాంధీ విమర్శ

న్యూఢిల్లీ: గర్భిణులకు ప్రసూతి ప్రయోజనాలను అందించే ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌ పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. ఈ స్కీమ్​కు నిధుల కొరత తీవ్రంగా ఉందని.. దీంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోందని ఆమె అన్నారు. బుధవారం రాజ్యసభలో జీరో అవర్ లో ఆమె పీఎంఎంవీవై, జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్​ఎఫ్​ఎస్​ఏ)పై మాట్లాడారు. 

2013 సెప్టెంబర్‌‌లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పార్లమెంటు ఆమోదించిన జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్​ఎఫ్​ఎస్​ఏ).. కరోనా సమయంలో పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు అందించడానికి ప్రారంభించిన పీఎం గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకానికి పునాది అని సోనియా గాంధీ అన్నారు. ఎన్​ఎఫ్​ఎస్​ఏ ఆధారంగా 2017లో పీఎంఎంవీవై ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ఎన్​ఎఫ్​ఎస్​ఏ కింద గర్భిణులకు ఆడ బిడ్డ పుడితే విడతల వారీగా రూ.6 వేలు అందిస్తారు. 

రెండో కాన్పులో మళ్లీ ఆడ బిడ్డ పుట్టినా ఈ  స్కీమ్​వర్తిస్తుంది. అయితే, 2022-–23 సంవత్సరానికి సంబంధించిన సమాచారం ప్రకారం, దాదాపు 68% మంది గర్భిణులు తమ మొదటి ప్రసవానికి కేవలం ఒకసారి మాత్రమే నిధులు పొందారని, మరుసటి సంవత్సరంలో వారి సంఖ్య 12 శాతానికి  పడిపోయిందని సోనియా గాంధీ తెలిపారు. అలాగే, పీఎంఎంవీవైని కేంద్ర బడ్జెట్ పత్రాలలో విడిగా ప్రస్తావించకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. ఈ స్కీమ్ అమలుకు ఏటాసుమారు రూ.12 వేల కోట్లు అవసరమని.. కానీ, బడ్జెట్​లో కేవలం రూ. 2,521 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.