
న్యూఢిల్లీ: భారతీయ విద్యావ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందులో భాగంగానే కొత్త జాతీయ విద్యా విధానాన్ని(2020) తెరమీదకి తెచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆరోపించారు. న్యూ ఎన్ఈపీ వెనుక గుత్తాధిపత్యం (సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్), వ్యాపారం (కమర్షలైజేషన్ఆఫ్ ఎడ్యుకేషన్), పాఠ్యపుస్తకాల్లోకి మత వ్యాప్తి (కమ్యునలైజేషన్ ఆఫ్ టెక్స్ట్బుక్స్) అనే మూడు ‘సీ’ల లక్ష్యం దాగి ఉందని మండిపడ్డారు.
దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సోమవారం ఓ పత్రికకు రాసిన ఆర్టికల్లో సోనియాగాంధీ తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. విద్యా విధానంలోకి చొరబడాలని పదేండ్లుగా మోదీ సర్కార్ చూస్తున్నదని, అందులో భాగంగానే న్యూ ఎన్ఈపీని తీసుకువచ్చిందని మండిపడ్డారు. ‘‘పదేండ్లలో విద్యా వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకోవాలని మోదీ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. విద్యా వ్యవస్థను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని.. ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గించి, ప్రైవేటు రంగానికి అప్పగించాలని.. పాఠ్యపుస్తకాల్లో, విద్యాసంస్థల్లో మతాన్ని చొప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇది విద్యావ్యవస్థకు మరణ శాసనం లాంటిది” అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించారా?
ఎన్ఈపీ–2020 అమలు విషయంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఒక్కసారి కూడా సంప్రదించలేదని.. సలహాలు, సూచనలు తీసుకోలేదని సోనియాగాంధీ మండిపడ్డారు. మోదీ సర్కార్ అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణిని తిప్పికొట్టాలని సూచించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య ఏటా జరగాల్సిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) సమావేశాలను 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు.
ఇది దేనికి సంకేతం? రాష్ట్రాలకు రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్ నిధులను కూడా కేంద్రం ఆపేసింది. రాష్ట్రాల ఆధీనంలో ఉన్న వర్సిటీలకు యూజీసీ రూల్స్ శాపంగా మారుతున్నాయి. వీసీల నియామకంపై కేంద్రం పెత్తనం చెలాయించేలా ఇవి ఉన్నాయి” అని పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో కూడా కేంద్రం పలుకుబడి ఉన్నవాళ్లనే నియమిస్తూ.. గుత్తాధిపత్యానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ హత్య, మొఘల్ చరిత్ర వంటి పలు అంశాలను ఇప్పటికే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో తొలగించాలని కేంద్రం చూసిందని.. చివరికి విద్యార్థుల నిరసనలతో వెనక్కి తగ్గిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.