పొత్తి కడుపులో నొప్పితో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ డిశ్చార్..

పొత్తి కడుపులో నొప్పితో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ డిశ్చార్..

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఉదయం ఆమె అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదని, ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించిన వైద్యులు డిశ్చార్జ్ చేశారు. పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతూ ఆమె గురువారం ఉదయం 8.30 గంటలకు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

సర్ గంగారాం హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ సమీరన్‌ నందీ ఆమెకు చికిత్సనందించారు. 2024 డిసెంబర్లో సోనియా గాంధీ 78వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కూడా సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు రెండు సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లారు.

ఇదిలా ఉండగా.. రాజ్యసభలో పేదల తరపున సోనియా గళం విప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది పేదల పొట్టకొడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లందరికీ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలు దక్కట్లేదని చెప్పారు. వీలైనంత తొందరగా దేశవ్యాప్తంగా జన గణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 

నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద 2011 జనాభా లెక్కల ప్రకారమే లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవడం దారుణమన్నారు. అప్పటినుంచి పెరిగిన జనాభా ప్రకారం దాదాపు 14 కోట్ల మందికి తిండి గింజలు అందట్లేదని అన్నారు. ఈ ఏడాదిలోనైనా కొత్తగా జన గణన చేయాలని, డేటా ఆధారంగా పేదలకు ఆహార భద్రత కల్పించాలని సోనియా కోరారు.