తెలంగాణలో గత పదేండ్ల నుంచి ప్రతి ఇంటా జూన్ 2న పండుగ. దశాబ్దాల కలను సాకారం చేసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అదో పర్వదినం. ఇదెవ్వరూ కాదనలేని సత్యం. రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించింది. 2004లో యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీపై కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ ( ప్రస్తుతం బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పట్టుబట్టి కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్పించడం మూలాన మాటిచ్చిన కారణంగా... అనేకానేక ప్రక్రియలు, లాంచనాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినమాట ప్రకారం నెరవేర్చిన నాయకురాలు సోనియాగాంధీ.
తెలంగాణ చరిత్రలో సోనియమ్మకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. అందులో భాగంగానే ఈ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను అతిథిగా ఆహ్వానిస్తోంది. అయితే సోనియాను ఎలా పిలుస్తరు..ఎందుకు పిలుస్తరు.. ఏ హోదాలో ఆహ్వానిస్తరు? అధికార కార్యక్రమానికి అనధికార వ్యక్తులెందుకు? బలిదానాలకు కారణమైన సోనియా ఇప్పుడు దేవత ఎలా అయిందంటూ చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తప్పు పడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం సోనియాను పిలిస్తే ఇందులో కిషన్ రెడ్డికి కలిగిన ఇబ్బంది, అసౌకర్యం ఏమిటో అర్థం కాదు. ఉన్నట్టుండి ఆయన సోనియా గాంధీ రాకను ఎందుకు తప్పు పడుతున్నారో అర్థం కావడం లేదు. రాజకీయంగా రెండు జాతీయ పార్టీల మధ్య వైరం ఉంటే ఉండొచ్చు. కానీ, తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పాత్రనూ ఆయన మరిచినట్టు కనపడుతున్నది.
సెప్టెంబర్ 17న కేంద్ర మంత్రి అమిత్ షాను పరేడ్ గ్రౌండ్‌కు ఆహ్వానించి బీజేపీ సంబురాలు చేసుకున్నప్పడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ చరిత్రను వక్రీకరించినా ఎవ్వరూ కిమ్మనలేదు. కానీ, కిషన్ రెడ్డి ఒక జాతీయ పార్టీకి రాష్ర్ట అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలా
మాట్లాడడం భావ్యమా అనే చర్చ జరుగుతున్నది.
నాడు రాజీనామా చేయలె
తెలంగాణ కోసం పోరుబాట చేసిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానాలు చేసి తన సహజమైన వ్యతిరేక భావజాల ధోరణిని బయటపెట్టుకున్నారు. తెలంగాణ సమాజమంతా ఒకవైపు నిలబడ్డప్పుడు కిషన్ రెడ్డి మరోవైపు నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. చివరికి తన సహచర శాసనసభ్యుడు యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పలాయనం చిత్తగించిన కిషన్ రెడ్డికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై, అతిథిగా వస్తోన్న సోనియాగాంధీని ప్రశ్నించే నైతిక అర్హత ఎక్కడిదని తెలంగాణ సమాజం ప్రశ్నించే పరిస్థితి నెలకొంది.
కిషన్ రెడ్డి తన మాటల్లో బలిదానాల గురించి మాట్లాడిండు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలకు బీజేపీయే కారణమన్న భావన లేకపోలేదు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణ ఏర్పాటును మరిచింది.
సోనియా లేకుంటే తెలంగాణ అసాధ్యం
నాడు చంద్రబాబు లాంటి సీమాంధ్ర లీడర్ల ఒత్తిళ్లకు తలొగ్గి వాజ్ పేయి ప్రధానిగా ఉన్న టైంలో చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను పక్కనపెట్టారు. తెలంగాణను ఆ మూడు రాష్ట్రాలతో కలిపి ఇస్తే ఈ ప్రాంతంలో ఇన్ని బలిదానాలు అయ్యేవి కావు. తెలంగాణ రాష్ట్రం పుణ్యమా అని మంత్రి పదవి వస్తే తెలంగాణకు ఏం చేసిండని పదే పదే విపక్షాలు ఇప్పటికీ నిగ్గదీస్తున్నాయి.
ఇక బీజేపీ కూడా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీ సహా బీజేపీ నేతలు ఇప్పటికీ తమ వ్యతిరేక, అసూయ ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు సోనియాను పిలిస్తే తప్పా? ఆ ఆకాంక్షను సాకారం చేసినవాళ్లను గౌరవించుకోవద్దా? సోనియా లేకుంటే తెలంగాణ అసాధ్యమన్నది నిజం కాదా? బలిదానాలను గుర్తించిందెవరు? అవమానించిందెవరు? తెలంగాణపై మొదటి హామీ ఎవరిది? నిలబెట్టుకున్నదెవరు? ఉద్యమంలో ఉన్న ఆ తరం, ఈ తరంతోపాటు భావితరం కూడా సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పొద్దా? రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతయితే ఉన్నదో రాష్ట్రం ఏర్పడాలన్న బలీయమైన కాంక్ష ఆమెలో నిగూఢంగా ఉన్నదన్నది తెలంగాణ బుద్ధిజీవుల ప్రబలమైన అభిప్రాయం.
సోనియాజీ చెరగని ముద్ర
1969 నుంచి అనేకానేక ప్రభుత్వాలు మారినా, అనేకమంది ప్రధానులు, పార్టీలు తెలంగాణపై స్పష్టమైన రాజకీయ నిర్ణయాన్ని తీసుకునేందుకు వెనుకడుగు వేసినా ఆ అరవై ఏండ్ల ఆకాంక్షను సాకారం చేయడంలో సోనియా గాంధీది తెలంగాణ పటంలో చెరగని ముద్రే. నెరవేరదనుకున్న ప్రత్యేక తెలంగాణ మన తరంలో వచ్చినందుకు రాష్ట్రాన్ని ఇచ్చినందుకు, తెచ్చినందుకు తెలంగాణ సమాజం మననం చేసుకోవాలని తలపోస్తున్నది.
2 రాష్ట్రాల్లో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఆమె తీసుకున్న రాజకీయ నిర్ణయం చరిత్రను, తెలంగాణ గతిని మార్చిందని చెప్పాలి. తెలంగాణ ఇస్తే చాలు, రాష్ట్రమొస్తే టీఆర్ఎస్ లాంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్న టీఆర్ఎస్ నేత వ్యాఖ్యల్ని ఈ సందర్బంగా గుర్తు చేయాల్సి వస్తున్నది.
కేసీఆర్ సోనియాను ఏనాడూ సన్మానించలే
తెలంగాణ ఇచ్చింది సోనియానేనని తెచ్చేందుకు కారణమైన కేసీఆర్ రాష్ట్రం సిద్ధించిన అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మరి ఆమెకు కృతజ్ఞత చెప్పారు. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీ తొలి శాసనసభలో.. కేవలం సోనియా వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే రాష్ట్రం సిద్ధించి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి రాజకీయంగా ఎంతో లబ్ధి పొందిన పదేండ్లలో ఆమెను పిలిచి కనీసం సన్మానం చేయలేకపోయారు. వందల కోట్లతో దశాబ్ది వేడుకలను గత బీఆర్ఎస్ సర్కారు వేడుకలను నిర్వహించినా నాటి నిజమైన యోధులకు గుర్తింపు ఇవ్వలేదన్నది బహిరంగ రహస్యం.
తెలంగాణ గతిని మార్చిన సోనియా
ఇక ఏ హోదాలో సోనియాను దశాబ్ది వేడుకలకు ఆహ్వానిస్తారని కేంద్ర మంత్రికిషన్‌రెడ్డి సూటి ప్రశ్న? మరి ఏ హోదాలో ఆమె తెలంగాణ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నారు? ఏ హోదాలో బీజేపీ సహా పార్లమెంటులో ఉన్న పార్టీలను ఒక్కటి చేసి బిల్లు పెట్టింది? సోనియా గాంధీకి ఏ హోదా ఉన్నదని హైదారాబాద్‌తో కూడిన తెలంగాణ మన చేతుల్లో ధనిక రాష్ట్రంగా పెట్టింది. ఆమె ఏ హోదాలో పార్టీని ఇక్కడా, అక్కడా త్యాగం చేసింది? రెండుసార్లు పార్టీ ఓడినా నా తెలంగాణ ప్రజలు బాగుంటే చాలని తలపోసింది? రాష్ట్రమిస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక పోయినా ఆమె మౌనంగా ఎందుకున్నది లాంటి స్వీయ ప్రశ్నలను తెలంగాణ సమాజం సంధిస్తున్నది.
భవిష్యత్తుకు బాటలు
జూన్ 2 నాటికి పదేండ్లు దాటుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన ఉద్యమ యోధులను పిలవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఇచ్చిన సోనియాతో పాటు తెచ్చిన గుర్తింపు ఉన్న కేసీఆర్ ను, బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ, ఇతర పక్షాలు సహా జేఏసీలు, రాజకీయ నిర్ణయాలలో ముందుకుసాగిన వివిధ పక్షాలను, ఉద్యమకారులను, కవులను, కళాకారులను, జర్నలిస్టులను పిలిచి రాష్ట్ర ఏర్పాటు అనివార్యత.. ఎలా సాకారమైంది, నాటి రాజకీయ నిర్ణయాలపై సెమినార్లు, ఇష్టాగోష్టిలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా పదేండ్లలో పెండింగ్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన, నీటి వాటాలు తేల్చడం, ఆర్థిక అంశాలను చర్చించి భావి రోజులకు బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది.
- వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం