ఏఐసీసీ కొత్త ఆఫీస్ ప్రారంభం.. లైబ్రరీకి మన్మోహన్ సింగ్ పేరు

  • ఆరంతస్తులతో అధునాతన భవనం
  • ప్రతి ఫ్లోర్​లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏండ్ల చరిత్రను తెలిపేలా ఫొటోలు
  • నెహ్రూ మొదలుకుని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు, పీఎంల చిత్రాలు 
  • లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, పీవీ, మన్మోహన్ ఫొటోలు.. గాంధీ, 
  • అంబేద్కర్ చిత్రాలు కూడా ఏర్పాటు  
  • ప్రారంభోత్సవానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్​లు హాజరు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త హెడ్ ఆఫీసు ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని 9ఏ, కోట్లా రోడ్డులో సకల సౌలతులతో నిర్మించిన అధునాతన ఏఐసీసీ కొత్త హెడ్ క్వార్టర్స్ భవనాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కలిసి సోనియా రిబ్బన్ కట్ చేశారు. ఆరంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో ప్రతి ఫ్లోర్ లోనూ పార్టీ 139 ఏండ్ల చరిత్రను తెలియజేసేలా గోడలను అలనాటి చిత్రపటాలతో అలంకరించారు. ఈ బిల్డింగ్ కు ‘ఇందిరా భవన్’గా పేరు పెట్టినట్టు పార్టీ చీఫ్ ఖర్గే ప్రకటించారు. బిల్డింగ్​లోని గ్రౌండ్ ఫ్లోర్​లో ఉన్న లైబ్రరీకి ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ లైబ్రరీ’గా నామకరణం చేసినట్టు తెలిపారు. 

ముందుగా భవనం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వందేమాతరం, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం భవనాన్ని ప్రారంభించి నేతలు అందులోకి ప్రవేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీసు 47 ఏండ్లుగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్డులో ఉన్న పాత బిల్డింగ్ లో కొనసాగింది. మారిన పరిస్థితులు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అధునాతన సౌలతులు, విశాలమైన గదులు, మీటింగ్ హాల్, ఇతర వసతులు ఉండేలా ఆరంతస్తులతో కొత్త భవనాన్ని నిర్మించాలని సోనియా గాంధీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే నిర్ణయించారు. 

2016, డిసెంబర్1న ఈ భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. కానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి నిధుల కొరత, ఇతర సమస్యలు రావడంతో భవన నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు భవనం ఇటీవల పూర్తికావడంతో బుధవారం ప్రారంభానికి నోచుకుంది. కాగా, కరోనా విపత్తు సమయంలో ఈ భవన నిర్మాణ కార్మికులు క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు పార్టీ ఖర్చులను భరించింది. మొత్తం నిర్మాణ వ్యయంలో ఒక్క శాతంతో ఎంసీడీ టాయిలెట్లను నిర్మించింది.   

పాత ఆఫీసూ ఉంటది.. 

కాంగ్రెస్ పార్టీకి కొత్త హెడ్ క్వార్టర్స్ సమకూరినప్పటికీ.. ఇప్పటివరకూ 24, అక్బర్ రోడ్డులో ఉన్న ఆఫీసు భవనాన్ని కూడా పార్టీ వినియోగించుకోనుంది. పాత భవనాన్ని 1978లో కాంగ్రెస్ (ఐ) ఏర్పాటైనప్పటి నుంచీ పార్టీ హెడ్ ఆఫీసుగా వినియోగిస్తున్నారు. పార్టీకి చెందిన కొన్ని విభాగాలు కూడా ఇక్కడే కొనసాగాయి. అక్బర్ రోడ్డులోని ఈ చరిత్రాత్మకమైన బంగ్లాలో ఒకప్పుడు వైస్రాయ్ లార్డ్ లిన్ లిట్గో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన సర్ రెజినాల్డ్ మాక్స్ వెల్ నివసించారు. 1961లో ఆంగ్ సాన్ సూకీ టీనేజ్ లో ఉన్న సమయంలో భారత రాయబారిగా పని చేసిన తన తల్లితోపాటు ఇక్కడే ఉన్నారు. ఈ బిల్డింగ్ అత్యధిక కాలం మాత్రం కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీసుగా కొనసాగింది. పార్టీకి ఈ 47 ఏండ్లలో ఏడుగురు అధ్యక్షులు మారారు. కాగా, ఢిల్లీలో బీజేపీ కూడా కొత్త హెడ్ ఆఫీసును ఏర్పాటు చేసుకున్నా.. పాత భవనాన్ని సైతం వినియోగించుకుంటున్నది. గతంలో 11, అశోకా రోడ్డులో బీజేపీ పాత ఆఫీసు ఉండగా.. కొత్తగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో నిర్మించుకున్న భవనంలోకి పార్టీ హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ అయింది.    

మన్మోహన్ పేరు పెట్టాలని పోస్టర్లు.. 

కాంగ్రెస్ కొత్త ఆఫీసుకు సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్ గా పేరు పెట్టాలంటూ ఆ బిల్డింగ్ పరిసరాల్లో పోస్టర్లు వెలిశాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ హెడ్ ఆఫీసుకు మన్మోహన్ పేరు పెట్టి గౌరవించాలని డిమాండ్ చేసింది. మన్మోహన్ అంత్యక్రియలు కాగానే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వియత్నాంలో న్యూఇయర్ వేడుకలకు వెళ్లారని, ఆయనను గురువులాంటివారని చెప్పుకున్న రాహుల్ ఇలా అవమానించారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. మన్మోహన్ అస్థికలను సేకరించేందుకు పార్టీ ప్రతినిధులు కూడా ఎవరూ రాలేదన్నారు. ఇప్పటికైనా పార్టీ కొత్త ఆఫీసుకు మన్మోహన్ పేరును పెట్టి గౌరవించాలని కోరారు. అయితే, కాంగ్రెస్ కొత్త ఆఫీసు ముందు పోస్టర్లు వెలియడం వెనక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి కౌంటర్ ఇచ్చారు. ఇందిరా భవన్ అనే పేరును గతంలోనే నిర్ణయించామన్నారు.  

పార్టీ 139 ఏండ్ల చరిత్రను చాటేలా.. 

కాంగ్రెస్ కొత్త హెడ్ ఆఫీసులో ప్రతి ఫ్లోర్ లోనూ పార్టీ 139 ఏండ్ల చరిత్రను చాటేలా గోడలపై అలనాటి అరుదైన చిత్రాలను పొందుపర్చారు. 1885 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం, ఆ పార్టీ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, దిగ్గజ నేతలు, ప్రధాన ఘట్టాలు, పార్టీ సాధించిన విజయాల వంటివి తెలియజేసేలా అరుదైన ఫొటోలను, ఆనాటి ఘట్టాలను వివరించేలా రాతలతో సహా గోడలపై ఏర్పాటు చేశారు. నెహ్రూ నుంచి మొదలుకుని మన్మోహన్ సింగ్ వరకూ కాంగ్రెస్ ప్రధాన మంత్రులందరి ఫొటోలను, వారి హయాంలో సాధించిన విజయాలు, ఏఐసీసీ ముఖ్యమైన సమావేశాలకు సంబంధించిన ఫొటోలను చిత్రించారు. 1885 నుంచి 1920, 1925 వరకూ ఒక పీరియడ్ ను, ఆ తర్వాత నుంచి స్వాతంత్ర్యం వరకూ మరో పీరియడ్ ను, నెహ్రూ, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ పీరియడ్, ఇందిరా గాంధీ హయాం, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల నాటి ఘట్టాలను పొందుపర్చారు. ఆరంతస్తుల్లో కలిపి మొత్తం 246 ఫొటోలు, చిత్రాలను పెట్టారు.  

నెహ్రూ నుంచి రాహుల్ దాకా.. 

ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తో జవహర్ లాల్ నెహ్రూ దిగిన ఫొటోను, లాల్ బహదూర్ శాస్త్రి పొలాన్ని దున్నుతున్న ఫొటోను, 1971 యుద్ధం ముగింపు సందర్భంగా పాకిస్తానీ బలగాలు సరెండర్ అవుతున్న ఫొటోను, శాంతి ఒప్పందాలపై రాజీవ్ గాంధీ సంతకం చేస్తున్నప్పటి ఫొటోను, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఉన్న ఫొటోను, 2004లో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని పదవిని చేపట్టబోనని సోనియా గాంధీ ప్రకటించినప్పటి ఫొటోతో సహా అనేక ఫొటోలను ఏర్పాటు చేశారు. అలాగే  రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫొటోలను సైతం గోడలపై ఏర్పాటు చేశారు. అలాగే, ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో దేశం ఎదుర్కొంటోన్న సమస్యలను తెలిపేలా ప్రత్యేక ఫోటోలను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి, రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రాధాన్యం కల్పించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ.. మణిపూర్ నుంచి గుజరాత్ వరకూ సాగిన యాత్రను కండ్లకు కట్టేలా ఫోటోలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంత్ రామ్ శర్మ వంటి కాంగ్రెస్ హార్డ్ కోర్ సామాన్య కార్యకర్తకు ప్రత్యేక స్థానం కల్పించారు. నిజమైన కార్యకర్తల వీరోచిత కథలనూ రాసుకొచ్చారు.