రాజ్యసభకు సోనియా, నడ్డా

రాజ్యసభకు సోనియా, నడ్డా
  •     41 మంది ఏకగ్రీవంగా ఎన్నిక
  •     నామినేషన్ల విత్ డ్రాకు ముగిసిన గడువు
  •     మిగిలిన స్థానాలకు ఫిబ్రవరి 27న ఓటింగ్

జైపూర్: 
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్.మురుగన్​తో సహా 41 మంది రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగిసింది. యూపీలోని 10 సీట్లకు 11 మంది అభ్యర్థులు, కర్నాటకలో 4 సీట్లకు ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక్క సీటుకు ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. కర్నాటకలో కాంగ్రెస్ మూడో సీటు, హిమాచల్ లో ఒక్క సీటు కోసం పోటీపడబోతుంది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ మూడో సీటు కోసం బరిలో నిలిచింది. ఈ మూడు రాష్ట్రాల్లోని 15 సీట్లకు ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగనుంది. ఎన్ డీఏకు 29, ఇండియా కూటమికి 12 ఇప్పటి వరకూ బీజేపీ 20 సీట్లు, కాంగ్రెస్ 6, తృణమూల్ కాంగ్రెస్ 4, వైసీపీ 3, ఆర్జేడీ 2, ఎన్సీపీ 2, శివసేన, బీఆర్​ఎస్, జేడీయూ ఒక్కో సీటును గెలుచుకున్నాయి. ఎన్​డీఏ కూటమికి 29,  ఇండియా కూటమికి 12  స్థానాలు లభించాయి.

సోనియా గాంధీ, జేపీ నడ్డా ఎన్నిక..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్ బరేలీ నుంచి దాదాపుగా 25 ఏండ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఆమె తొలిసారిగా పెద్దల సభకు వెళ్లనున్నారు. ఇదే రాష్ట్రం నుంచి  బీజేపీ తరపున చున్నిలాల్‌ గరాసియా, మదన్‌ రాథోడ్‌ కూడా ఏకగ్రీవంగా పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మరో ముగ్గురు బీజేపీ నాయకులు జస్వంత్ సిన్హ్ పర్మర్, మయాంక్ నాయక్, గోవింద్ ఢోలాకియాతో కలిసి గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా గతంలో హిమాచల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశా నుంచి ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి అశోక్ చవాన్, మిలింద్ దేవ్ రా వరుసగా బీజేపీ, శివసేన నుంచి టికెట్లు పొంది ఏకగ్రీవంగా  పెద్దల సభలోకి వెళ్లనున్నారు.