న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెబెల్ నేతలతో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వరుసగా సమావేశమవుతున్నారు. ఇటీవలే గులాం నబీ ఆజాద్తో భేటీ అయిన సోనియా.. తాజాగా పార్టీ సీనియర్లు ఆనంద్ శర్మ, మనీష్ తివారీతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురు నేతలతో చాలా సేపు మంతనాలు జరిపారు. పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత పోరుపై మనీష్ తివారీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమైందని ఆరోపించారు. పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసిన మనీష్ తివారీ నుంచి సోనియా సూచనలు స్వీకరించడం విశేషం. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో జీ 23 గ్రూపునకు చెందిన మిగతా నేతలతోనూ సమావేశం కావాలని సోనియా గాంధీ నిర్ణయించారు.