సోనియాకు తొలి పరీక్ష!

దేశంలో అతి పెద్దది, అతి పాతది, ప్రజలతో శతాబ్దానికిపైగా అనుబంధం ఉన్నది కాంగ్రెస్​ పార్టీ. ఈ రోజున పూర్తి స్థాయిలో నడిపించగల నాయకత్వంకోసం దేవులాడుతోంది. 1998 నుంచి 2017 వరకు దాదాపు 19 ఏళ్లపాటు చైర్​పర్సన్​గా కొనసాగి దిగిపోయిన సోనియా గాంధీ… ఏడాదిన్నర గ్యాప్​ తర్వాత మరోసారి బాధ్యతలు అందుకున్నారు. ఈసారి  కాంగ్రెస్ ఇంటీరిమ్​ చైర్​పర్సన్​గా కొత్త వ్యక్తిని ఎన్నుకునేవరకు మాత్రమే ఉంటారు. ఈలోగా ఆమె నాయకత్వంలోనే మహారాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్​ సిద్ధం కావాలి. ఇవి ఒక రకంగా ఆమెకే కాకుండా, మొత్తం కాంగ్రెస్​ పార్టీలో గాంధీ–నెహ్రూ ఫ్యామిలీ వారసత్వానికే ఓ పరీక్షగా మారనున్నాయి.

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ–శివసేన కూటమి అధికారంలో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఒక టర్మ్  సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుని, మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు ఆయుధాలు రెడీ చేసుకుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్​కి ప్రత్యేక హక్కులు కల్పించిన ఆర్టికల్–370 రద్దు చేయడంతో బీజేపీ జోష్​లో ఉంది. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా మారిందని ఆ పార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. దీంతో బీజేపీ, శివసేన కూటమితో ఎన్నికల యుద్ధానికి కాంగ్రెస్ చెమటోడ్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో సోనియా గాంధీకి మహారాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు స్పష్టంగా చెప్పారు. ఫడ్నవీస్ వంటి నేతలను ఢీ కొట్టడానికి పార్టీ హై కమాండ్ కూడా ఆ స్థాయి నాయకులను, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న లీడర్లను బరిలోకి దించాలని సోనియాను కోరారు. కొందరు మాజీ కేంద్ర మంత్రి, దళిత నాయకుడు ముకుల్ వాస్నిక్ (59) పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక దశలో ఏఐసీసీ చీఫ్​గా వాస్నిక్ పేరు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలను సీరియస్​గా తీసుకోవాలని సోనియాకి సలహా ఇచ్చారు.

ఎన్సీపీతో  సీట్ల సర్దుబాటు కుదురుతుందా ?

మహారాష్ట్రలో పవర్​ఫుల్​ లీడరైన శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కాంగ్రెస్​ దోస్తీ సాగుతోంది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీట్ల పంపకం దగ్గర పేచీ రావడంతో విడివిడిగా పోటీ చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్లు 288 కాగా, కాంగ్రెస్​కి 42 సీట్లు, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ఈ అనుభవంతో ఇటీవలి లోక్​సభఎలక్షన్స్​లో మళ్లీ జత కలిశాయి. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ–శివసేన కూటమి 41 సీట్లు గెలుచుకున్నాయి.  ఎన్సీపీ 4, కాంగ్రెస్​ ఒకే ఒక్క సీటు (చంద్రపూర్) దక్కించుకున్నాయి. కాబట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ  కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్​తో ఇబ్బంది లేదు కానీ, ప్రాబ్లం అంతా ఆయన అన్న కొడుకు అజిత్ పవార్​తోనే అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అజిత్ మరీ ఎక్కువ సీట్లు కోరితే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని కొంతమంది సోనియాకి సలహా ఇచ్చారు. బీజేపీ–శివసేన కూటమి బలంగా ఉన్నందువల్ల ఒంటరిగా బరిలోకి దిగడం ఏమాత్రం మంచిది కాదని కాంగ్రెస్​ గట్టిగా ఒక అభిప్రాయానికి వచ్చింది.

చెరో 135 సీట్లలో బీజేపీ, శివసేన పోటీ?

ముఖ్యమంత్రి విషయంలో మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీతో శివసేన ఏకాభిప్రాయంగానే ఉంది. లోక్​సభ ఎలక్షన్స్​కి ముందు ఒంటికాలిపై లేచి, ఆ తర్వాత కలిసిపోయిన వైఖరి శివసేనది. కాబట్టి, సీఎం పోస్టుపై పట్టుదలకు పోకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. మొత్తం 288 సీట్లలో చెరో 135 సీట్లకు పోటీ చేయాలన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. మిగతా 18 సీట్లను మిత్రపక్షాలకు వదిలేయాలన్నది ప్రతిపాదనలోని మరో అంశం. శివసేనతో  కలిసే బరిలో దిగాల్సి ఉంటుందని మహారాష్ట్ర బీజేపీ లీడర్లకు కేంద్ర మంత్రి అమిత్ షా గట్టిగా చెప్పినట్లు తెలిసింది. రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి చివరకు కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొజిషన్ లోకి వస్తుందని ఢిల్లీ బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఫడ్నవీస్ ప్రభుత్వ విధానాలపై శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ లో ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ నాయకులు ఎవరూ బ్యాలెన్స్ కోల్పోయి కౌంటర్​ విమర్శలకు దిగలేదు. కాగా, ముఖ్యమంత్రి కేండిడేట్​గా మళ్లీ  దేవేంద్ర ఫడ్నవీసే ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి శివసేన నాయకులు కొంత అభ్యంతరం చెబుతున్నా చివరకు లొంగక తప్పదని శివసేన వ్యవహార శైలి గురించి బాగా తెలిసిన ఎనలిస్టులు అంటున్నారు.

రైతులపై దృష్టి పెట్టిన శివసేన

ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు శివసేన చాలా ముందుగా గ్రౌండ్ వర్క్  మొదలెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సొంతంగా సర్కార్ ఏర్పాటు చేయడానికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పక్కా ప్లాన్ తయారు చేశారు. ఈ ప్లాన్ ప్రకారం కూటమి ప్రభుత్వంలోని శివసేన మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించారు. మరీ దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న రైతులకు పార్టీ సాయం కింద స్వయంగా ఉద్ధవ్ ఠాక్రేనే కొంత నగదు విరాళంగా అందచేశారు. వానలు పడని మరఠ్వాడా ప్రాంతంలోని జిల్లాల్లో శివసేన మంత్రులు ఎక్కువగా పర్యటించారు. అక్కడి రైతులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు.

బీజేపీ, శివసేన బలాబలాలు

సీట్ల పంపకం ఒక కొలిక్కి రాకపోవడంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి.బీజేపీకి 122 సీట్లు రాగా శివసేన 63 సీట్లలో విజయం సాధించింది. తాజా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి మొత్తం 48 సీట్లలో 41 సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీ 25 సీట్లలో పోటీ చేసి 23 సీట్లలో విజయం సాధించింది. శివసేన 23 సీట్లలో పోటీ చేసి 18 సీట్లను గెలుచుకుంది.

కాంగ్రెస్ లో అన్నీ సమస్యలే

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్నా మహారాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. లోక్​సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ, నాయకత్వానికి రాజీనామా చేసిన ప్రభావం పార్టీపై పడింది. దాదాపు రెండున్నర నెలలుగా కాంగ్రెస్​కి నాయకుడంటూ లేకుండా పోయారు. ద్వితీయ శ్రేణి లోకల్​ లీడర్లు వేరే పార్టీల్లోకి  జంప్ అయ్యారు. మహారాష్ట్రకు చెందిన మిలింద్ దేవరా వంటి యువ నాయకుడు కూడా ఆర్టికల్–370 రద్దుపై  మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి  సగటు ప్రజల మూడ్ కు తగ్గట్టు వ్యవహరించడంలో  పార్టీ హై కమాండ్ ఫెయిల్ అయిందని యూత్ లీడర్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్​తో జనంలో పార్టీ పలచన అయింది. కేడర్​ని గైడ్ చేసే నాయకులే కరువయ్యారు.