Sonia Gandhi: విద్య కాషాయీకరణ, కేంద్రీకరణ, వ్యాపారం.. NEP-2020పై సోనియాగాంధీ ఫైర్

Sonia Gandhi: విద్య  కాషాయీకరణ, కేంద్రీకరణ, వ్యాపారం.. NEP-2020పై సోనియాగాంధీ ఫైర్

జాతీయ విద్యావిధానం-2020 పై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో బీజేపీ ప్రభుత్వం దేశంలో భారీ కుట్రకు తెరలేపిందని అన్నారు.  పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండా రాజకీయ స్వలాభం కోసం విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రముఖ పత్రిక ఓపెన్ పేజ్ కు రాసిన ఆర్టికల్ లో National Education Policy (NEP-2020) పై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. 

కొత్త విద్యావిధానం వెనుక ఉన్న బీజేపీ ఎజెండా ‘‘విద్య  కాషాయీకరణ, కేంద్రీకరణ, వ్యాపారం’’ అని విమర్శించారు. ఈ పాలసీ ద్వారా బీజేపీ ప్రభుత్వం చెప్తున్న లక్ష్యాలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయని, బయటికి చెప్పేది ఒకటైతే అంతర్గతంగా ఉన్న ఎజెండా మరొకటని అన్నారు. దేశంలో ఉన్న పిల్లలు, యువకులకు విజ్ఞానంతో కూడిన విద్య అందించడం కాకుండా మత భావాలను ఎక్కించడమే లక్ష్యంగా తీసుకొస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో వాళ్లు అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. 

కొత్త విద్యా విధానం ద్వారా అధికార కేంద్రీకరణ, ప్రైవేట్ సెక్టార్ ఔట్ సోర్సింగ్ ద్వారా వ్యాపారీకరణ, టెక్ట్స్ బుక్స్, పాఠ్యాంశాలు, విద్యా సంస్థల కాశాయీకరణ లక్ష్యంగా ఈ పాలసీని తీసకొస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. కేంద్రానికి, తమిళనాడుకు మధ్య జరుగుతున్న పరిణామాలపై, కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఆమె ఈ రకంగా స్పందించారు. 

►ALSO READ | హిమాచల్​​లో తుపాన్ చెట్టుకూలి ఆరుగురు మృతి

ఇప్పటికే NEP 2020పై తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు ఏకంగా వ్యతిరేక ఉద్యమాన్నే నిర్మిస్తోంది. హిందీని బలవంతంగా రుద్దడంపై సీఎం స్టాలిన్ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను ఏకథాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ఆధ్వర్యంలో డీలిమిటేషన్, నూతన విద్యా విధానం, హిందీ బలవంతంగా రుద్దడంపై సమావేశం నిర్వహించి బలమైన సంకేతం పంపారు. ఈ క్రమంలో జాతీయ విద్యా విధానంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు సోనియాగాంధీ.