హైదరాబాద్, వెలుగు : విజయభేరి సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆ నాడు కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని సోనియా ప్రకటించారని, ఇచ్చిన మాట ఆమె నిలబెట్టుకున్నారని చెప్పారు. అలాగే, ఈ ఆరు గ్యారెంటీలనూ నెరవేరుస్తారని పేర్కొన్నారు. విజయభేరి సభ నిర్వహిస్తున్న తుక్కుగూడ ప్రాంతాన్ని శుక్రవారం రేవంత్ రెడ్డి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభను జరగనివ్వొద్దన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల రాజకీయాలు చేశాయన్నారు.
ALSO READ: 80 వేల పుస్తకాలు చదివిన నీకు చరిత్ర తెలుస్తలేదా? : కిషన్‌రెడ్డి
‘‘తొలుత పరేడ్ గ్రౌండ్‌కు అనుమతి అడిగితే.. బీజేపీ నిర్వహించనున్న విమోచన దినోత్సవం పేరిట ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తుక్కుగూడలోని స్థలాన్ని దేవుడి మాన్యం పేరిట ఇవ్వలేదు. కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సభ కోసం రైతులే స్థలం ఇచ్చిన్రు. పంట నష్టపోయినా ఫర్వాలేదని ముందుకొచ్చిన్రు”అని రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నిరుద్యోగులను విజయభేరి సభకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తం: జైరాం రమేశ్
తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరామ్ రమేశ్ అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పారు. జోడోయాత్రతోనే కర్నాటకలో అధికారంలోకి వచ్చామని, తెలంగాణలోనూ పీఠమెక్కుతామని అన్నారు. కర్నాటక తరహాలోనే తెలంగాణలోనూ విజయభేరి సభలో సోనియా ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తారని చెప్పారు.
రాష్ట్రంలో అవినీతి రాజ్యం: కేసీ వేణుగోపాల్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని, కానీ.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నదని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అని విమర్శించారు. తొలిసారిగా హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుందని, కమిటీలోని 84 మంది సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పాలనలోని 4 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని చెప్పారు.