పార్లమెంట్​లో స్క్రిప్ట్ చదివి రాష్ట్రపతి అలసిపోయారు: సోనియాగాంధీ

పార్లమెంట్​లో స్క్రిప్ట్ చదివి రాష్ట్రపతి అలసిపోయారు: సోనియాగాంధీ
  • కాంగ్రెస్ మాజీ చీఫ్​ సోనియా
  • రాష్ట్రపతిని కించపరిచారంటూ మండిపడ్డ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. పార్లమెంట్​లో స్ర్కిప్ట్ చదివి చదివి రాష్ట్రపతి బాగా అలసిపోయారంటూ ఆమె చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. 

ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. సోనియా చేసిన కామెంట్లను కాంగ్రెస్ నేతలు సమర్థించగా, రాష్ట్రపతిని ఆమె కించపరిచారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. సోనియా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

అయితే రాష్ట్రపతి అంటే సోనియాకు ఎంతో గౌరవం ఉందని, నిజానికి రాష్ట్రపతిని బీజేపీనే చాలాసార్లు కించపరిచిందంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ ఫైర్..  

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని మీడియా చుట్టుముట్టింది. ‘రాష్ట్రపతి ప్రసంగంపై మీ అభిప్రాయమేంటి?’ అని వాళ్లను ప్రశ్నించింది. 

ఈ క్రమంలో సోనియా స్పందిస్తూ.. ‘‘పార్లమెంట్​లో స్ర్కిప్ట్ చదివి చదివి.. చివరకు వచ్చే సరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. అసలు ఆమె మాట్లాడలేకపోయారు” అని అన్నారు. అలాగే రాహుల్ స్పందిస్తూ.. ‘‘బోరింగ్.. నో కామెంట్స్. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పారు” అని కామెంట్ చేశారు. 

అయితే సోనియా కామెంట్లపై బీజేపీ ఫైర్ అయింది. రాష్ట్రపతిని ఆమె కించపరిచారంటూ మండిపడింది. ‘‘ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు. రాష్ట్రపతిని, ఒక గిరిజన మహిళను కాంగ్రెస్ అవమానించింది. దీనికి కచ్చితంగా ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి” అని కేంద్రమంత్రి జేపీ నడ్డా డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కౌంటర్.. 

సోనియాకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. ఆమె తప్పేమీ మాట్లాడలేదన్నారు. సోనియా మాటలను మీడియానే వక్రీకరించిందని మండిపడ్డారు. ‘‘రాష్ట్రపతి అంటే నా తల్లికి (సోనియా) ఎంతో గౌరవం ఉన్నది. పార్లమెంట్​లో ఇంత పెద్ద స్ర్కిప్ట్ చదివి రాష్ట్రపతి అలసిపోయి ఉంటారని సోనియా అన్నారు. కానీ ఆమె మాటలను మీడియా వక్రీకరించింది” అని ప్రియాంక గాంధీ అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు: రాష్ట్రపతి భవన్ 

రాష్ట్రపతిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ తప్పుపట్టింది. దేశంలోనే అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లేలా మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. 

‘‘పార్లమెంట్​లో ప్రసంగం టైమ్​లో రాష్ట్రపతి అలసిపోయారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. ఆమె అస్సలు అలసి పోలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండొచ్చు. అందుకే వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని పేర్కొంది.