కొడుకులు కాదురా మీరు: తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలంట..

కొడుకులు కాదురా మీరు: తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలంట..

తల్లిదండ్రులు చనిపోయాక తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు అంటుంటారు.. దీన్ని బలంగా నమ్మే మనవాళ్ళు కొడుకు పుట్టాలని ఎంతగానో కోరుకుంటారు. అయితే.. కొంతమంది కొడుకులు బతికుండగానే తల్లిదండ్రులకు నరకం చూపిస్తుంటే.. కొంతమంది చచ్చాక అంత్యక్రియలు కూడా చేయకుండా పున్నామ నరకానికి పంపిస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి.. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.. చనిపోయిన తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలంటూ కొడుకులు పట్టుబట్టిన ఘటన మధ్యప్రదేశ్ లోని తికమ్ ఘడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని తికమ్ గఢ్ జిల్లా లిధోరాతాల్ కు చెందిన 85 ఏళ్ల ధ్యానీ సింగ్ ఘోష్ వయోసంబంధిత సమస్యలు, అనారోగ్యంతో మరణించాడు. తండ్రి బతికుండగా చూసుకున్న పెద్ద కొడుకు దామోదర్ సింగ్ తన తండ్రి అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. అయితే.. అదే సమయంలో, ఆయన తమ్ముడు కిషన్ సింగ్ తండ్రి మరణవార్త తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలు తానే చేస్తానని చిన్న కొడుకు కిషన్ సింగ్ పట్టుబట్టడంతో అన్నదమ్ముల మధ్య వాగ్వాదం మొదలైంది.

ALSO READ | నదిలో శవాలు పడేశారు.. మహా కుంభమేళా నీరు కలుషితం.. జయాబచ్చన్ సంచలన ఆరోపణలు

తండ్రి బతికినంత కాలం బాగోగులు చూసుకున్నానని.. దగ్గరుండి వైద్యం చేయించానని.. తలకొరివి పెట్టే బాధ్యత తనదేనని పెద్ద కొడుకు దామోదర్ సింగ్ అన్నాడు. అన్న మాటలు ఖాతరు చేయని తమ్ముడు కిషన్ సింగ్.. తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలని పట్టుబట్టాడు. ఇది విన్న ఊరి జనం అవాక్కయ్యారు. అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఐదు గంటల హైడ్రామా తర్వాత పెద్ద కొడుకుతో అంత్యక్రియలు జరిపించారు.