- కొడుకు ప్రాణం పోయింది.. ఇల్లు కూలిపోయింది
- నిజామాబాద్లోఓ ఇంట తీవ్ర విషాదం
- పాములు కాటేసికుమారుడు మృతి
- ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేసరికి కూలిన ఇల్లు
నవీపేట్, వెలుగు: వాళ్లది పేద కుటుంబం. రెండేండ్ల బాబు, మూడు నెలల పసిపాపతో కూలడానికి సిద్ధంగా ఉన్న పెంకుటింట్లో బతు కు వెళ్లదీస్తున్నారు. కానీ, వారిపై విధి పగబట్టింది. శుక్రవారం రాత్రి పెంకుటింటి పైనుంచి వచ్చిన రెండు పాములు కొడుకును కాటేశాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా ట్రీట్ మెంట్ పొందుతూ బాబు చనిపోయాడు. డెడ్ బాడీని తీసుకుని ఇంటికి వచ్చేసరికి.. శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలిపోయింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్మండలంలోని బినోల గ్రామానికి చెందిన మంగలి భూమేశ్ బార్బర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి కొన్నేండ్ల కింద అర్చితతో పెండ్లయ్యింది. వీరికి రెండేండ్ల కొడుకు రుద్రాన్ష్, మూడు నెలల కూతురు ఉన్నారు. భూమేశ్కుటుంబం శిథిలావస్థకు చేరిన పెంకుటింట్లో ఉంటోంది. శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల టైమ్ లో ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా, ఇంటి పైకప్పు నుంచి రెండు కట్ల పాములు కిందపడ్డాయి. అవి సరాసరి రుద్రాన్ష్పైనే పడి కాటు వేశాయి. దీంతో పిల్లాడు ఒక్కసారిగా ఏడ్వగా, తల్లిదండ్రులు లేచి చూసేసరికి పక్కనే పాములు కనిపించాయి.
ఫోన్ ఎత్తని 108 సిబ్బంది
రాత్రి కావడం, ఎవరు వస్తారో రారో తెలియని ఆపత్కాలంలో భూమేశ్108 అంబులెన్స్‌కు ఫోన్‌చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అరగంట ఇంట్లోనే గడిచిపోయింది. దీంతో స్థానికంగా ఉండే ఆటోను మాట్లాడుకుని మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. ఇది12 కిలోమీటర్ల దూరం ఉండడంతో మరో అరగంట పట్టింది. అప్పటికే బాబు స్పృహ కోల్పోవడంతో పరిస్థితి విషమంగా ఉందని అక్కడి డాక్టర్లు జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 20 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్గవర్నమెంట్దవాఖానకు తరలించారు. అప్పటికే శనివారం తెల్లవారుజామున 3 గంటలైంది. వెంటనే ట్రీట్మెంట్ప్రారంభించినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ట్రీట్ మెంట్ పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు రుద్రాన్ష్ కన్నుమూశాడు.
వచ్చేసరికి కూలిన ఇల్లు..
చనిపోయిన కొడుకు శవాన్ని తీసుకుని ఇంటికొచ్చిన భూమేశ్కుటుంబసభ్యులకు మరో ఆపద వచ్చి పడింది. అప్పటికే శిథిలావస్థలకు చేరిన ఇల్లు వర్షాలకు కుప్పకూలింది. దీంతో కొడుకు డెడ్‌బాడీని అట్లాగే శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశారు. ప్రస్తుతం భూమేశ్ తన షాపులోని షట్టర్రూమ్లో భార్య, బిడ్డతో కలిసి ఉంటున్నాడు. కొడుకు చావుకు వచ్చిన బంధువులు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నారు.