Sonu Nigam: వెన్నునొప్పితోనే రాష్ట్రపతి భవన్‌లో పాట.. సోను నిగమ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్

Sonu Nigam: వెన్నునొప్పితోనే రాష్ట్రపతి భవన్‌లో పాట.. సోను నిగమ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ (Sonu Nigam) క్రేజీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కువగా హిందీ సినిమాల్లో పాటలు పాడినప్పటికీ తెలుగు సాంగ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బెంగాలీ, కన్నడ, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి అనేక భాషల్లో పాటలు పాడుతూ సోను ఎంతో గుర్తింపు పొందాడు.

లేటెస్ట్గా ఈ వెర్సటైల్ సింగర్కు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రపతి భవన్ దివస్ వేడుకల్లో భాగంగా (ఫిబ్రవరి 3, 2025న) రాష్ట్రపతి భవన్‌లో సోను నిగమ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. నిగమ్ తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకర్షించాడు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లో కొత్తగా ప్రారంభించబడిన ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సింగర్గా  సోను నిలిచాడు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు పాట పాడే ప్రత్యేక గౌరవం సోనుకు లభించింది. ఆయన ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించడమే కాకుండా వ్యక్తిగత సంభాషణలో కూడా పాల్గొన్నారు.

ఆ అద్భుతమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ “ఒక భారతీయుడిగా, రాష్ట్రపతి భవన్ దివాస్‌లో ప్రదర్శన ఇవ్వడం ఎంతో సంతోషం.  భారత రాష్ట్రపతి సమక్షంలో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించబడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమెతో వ్యక్తిగతంగా సంభాషించే అవకాశం నాకు లభించినందున ఈ అనుభవం మరింత ప్రత్యేకంగా మారింది. ఈ అరుదైన క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అని సోను తెలిపారు.

అయితే, సింగర్ సోనూ నిగమ్‌ రాష్ట్రపతి భవన్ దివస్ వేడుకల్లో పాల్గొనక ముందు రోజు ఆదివారం (ఫిబ్రవరి 2న) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. పూణేలో ఓ లైవ్ పెర్ఫార్మెన్స్లో తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అక్కడి నుంచి వెంటనే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, తాను సాంగ్ పాడుతూ, స్టేజిపై హుషారుగా డ్యాన్స్ కూడా చేసాడు. దాంతో ఒక్కక్షణం తీవ్రమైన వెన్ను నొప్పి అటాక్ కావడంతో హాస్పిటల్లో చేరాడు.

ఈ విషయాన్ని సోను తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. "నొప్పి చాలా బాధాకరం. ఎవరో నా వెన్నెముక దగ్గర సూదిని ఉంచినట్లు అనిపించింది. అది చిన్న కదలిక అయినప్పటికీ శరీరంలో లోతుగా గుచ్చుతుంది. అది నిజంగా దారుణం" అని ఆయన రాశారు.

Also Read :- గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్‌పై ప్రైమ్ వీడియో అప్డేట్

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక రోజు ముందే తీవ్రమైన నొప్పి, ఆ మరుసటి రోజే రాష్ట్రపతి ముందు పాట..దాంతో సోను డెడికేషన్ పట్ల శ్రోతలు హ్యాట్సాఫ్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. 

51 ఏళ్ల సోను నిగమ్ 35 సంవత్సరాలకు పైగా పాటలు పాడుతున్నారు. ఇప్పటివరకు అతను 32 కి పైగా భాషలలో పాడారు. ఆయనకు 2022 లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అనేక దేశీ పాప్ ఆల్బమ్స్ కూడా విడుదల చేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. భారతీయ గాయకుల్లో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో సోను ఒకడు.