స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు
లాక్డౌన్ సమయంలో ఎంతోమందికి సాయం చేసిన నటుడు సోనూసూద్ ప్రజలందరి మనసుల్లో హీరోగా నిలిచారు. లాక్డౌన్ వల్ల పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది వలసదారులను తమ సొంత గ్రామాలకు పంపింనందుకుగాను ప్రతిష్టాత్మక ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు’తో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం (యూఎన్‌డీపీ) ద్వారా సత్కరించింది. కరోనావైరస్ సంక్షోభ సమయంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వలసదారులకు నిస్వార్థంగా ఆహారం, బస్సులు, రైళ్లు మరియు చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు.. వారికి జీవనోపాధి కల్పించినందుకుగానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు. సోమవారం జరిగిన వర్చువల్ మీట్‌లో ఆయన ఈ అవార్డు తీసుకున్నారు.
సోనూసూద్‌కు ఇచ్చిన ఈ అవార్డుపై యుఎన్‌డిపి ఒక ప్రకటన చేసింది. ‘మిస్టర్ సోనుసూద్‌కు ఇచ్చిన ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు’ పంజాబ్ ప్రభుత్వ ప్రణాళిక విభాగం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో ఇవ్వబడింది. అవార్డు గ్రహీతలను స్వతంత్ర జ్యూరీ సిఫారసు ఆధారంగా ఎన్నుకున్నారు. ఈ ఎంపికలో కానీ సోనుసూద్‌కు అవార్డును ప్రదానం చేయడంలో కానీ యూఎన్‌డీపీ కలగచేసుకోలేదు. ఈ అవార్డును అందుకున్నందుకు సోనూసూద్‌ను అభినందిస్తున్నాం. కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి ఆయన చేసిన మానవతా ప్రయత్నాలను అభినందిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది.
ఐరాసకు చెందిన వివిధ సంస్థలచే ఇవ్వబడే ఈ అవార్డును.. గతంలో ప్రియాంక చోప్రా, లియోనార్డో డికాప్రియో, ఏంజెలీనా జోలీ, డేవిడ్ బెక్హాం, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, కేట్ బ్లాంచెట్, ఆంటోనియో బాండెరాస్ మరియు నికోల్ కిడ్మాన్‌లు అందుకున్నారు.
సోనూసూద్ అనేక హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. అతను 1999లో కల్లాజగర్ అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత 2002లో షాహీద్-ఇ-అజామ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. దబంగ్, యువ, అతడు, జోధా అక్బర్, డూకుడు, షూటౌట్ ఎట్ వడాలా, హ్యాపీ న్యూ ఇయర్ మరియు సింబా వంటి చిత్రాలలో నటించిన సోను సూద్ చాలా ప్రసిద్ది చెందారు.
సోనూసూద్‌కు ఈ అవార్డు రావడం పట్ల సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
.@UNDP statement on award to Mr. Sonu Sood. pic.twitter.com/DelxHJcjaj
— UNDP India (@UNDP_India) September 29, 2020
For More News..