బుల్లితెరపై యాంకర్ గా సోనుసూద్

వెండితర నటుడు, నిజజీవిత హీరో సోను సూద్ బుల్లితెరపై అలరించనున్నాడు. ఇప్పటి వరకు వెండితెరకే పరిమితమైన ఆయన ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆపద్భాందవుడిలా ఆదుకునే సోనూసూద్‌ కరోనా సమయంలో చేసిన సేవలు, ఆపదలో ఉన్న వారి కోసం స్పందించే మనస్తత్వంతో దేశ వ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. కరోనా విపత్కర పరిస్థితులు తగ్గిపోయినా.. ఇప్పటికీ ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. 
జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండడంతో ఆయన కూడా సినిమాలకు సై అంటున్నారు. అంతే కాదు తొలిసారిగా బుల్లితెరపై పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లకే చేరుకోనున్నారు. ఇండియా టుడే ఇటీవల ప్రారంభించిన గుడ్‌ న్యూ టుడే చానల్‌ ' దేశ్‌ కీ బాత్‌ సునాతా హూ' పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సోనూసూద్‌ యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. కరోనా కష్ట కాలంలో సోనుసూద్ చేసిన సాయం మానవత్వాన్ని తట్టి లేపిందని, ప్రతి ఒక్కరిలో సానూకూల ధృక్పథం, ప్రేరణను నింపాయని ఇండియా టూడే గ్రూప్‌ చైర్‌పర్సన్‌ కల్లిపూరీ పేర్కొన్నారు. సోను సూద్ తో కలసి తమ చానల్‌ ద్వారా మరింత చిరునవ్వులు, మంచి వార్తలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.