పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో త్వరలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాకు తెలిపారు.
శనివారం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించిన ఆయన.. అవసరమైన మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పర్యవేక్షక అధికారిగా ఒక ఏసీపీ, ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్‌ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, 12 మంది కానిస్టేబుళ్లు అందుబాటులో ఉండనున్నారు. ఈ బృందం సైబర్ బాధితులకు సత్వర సహాయం అందించడం, సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం మరియు నేరస్థులను అరెస్టు చేయడం వంటివి చేయనుంది.
కాగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు సైబర్ క్రైమ్‌కు సంబంధించి మొత్తం 654 కేసులు నమోదయ్యాయని సీపీ రంగనాథ్ తెలిపారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎక్కువుగా లాటరీ/గిఫ్ట్ ఫ్రాడ్, ఫిషింగ్/విషింగ్/స్మిషింగ్, కార్డ్ స్కిమ్మింగ్, లోన్ ఫ్రాడ్, మనీ ట్రాన్స్‌ఫర్ మోసం, మాల్వేర్ మరియు ఐడెంటిటీ చోరీ కేసులు వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
బాధితులు సైబర్ క్రైమ్ మోసాలపై X (ట్విట్టర్), పేస్ బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ల ద్వారా లేదా https://wa.me/918712672222 లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే ఫిర్యాదు చేస్తే.. అధీకృత సిబ్బంది బాధితుల ఖాతాలను స్తంభింపజేయడం లేదా తగు అవసరమైన చర్యలు తీసుకోవడంలో సహాయం చేస్తారు.
మిమ్మల్ని ఎవరైనా మీ కార్డ్ డీటైల్స్ అడిగినా లేదా ఏదైనా లింకు పంపించి క్లిక్ చేయమన్నా, స్పందించవద్దు.
— Warangal Police (@warangalpolice) August 24, 2023
సైబర్ క్రిమినల్స్ వివిధ మార్గాల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండండి. మీ తోటి వారికి కూడా అవగాహన కల్పించండి.#Dial1930@cpwarangal pic.twitter.com/LKAtfl4GYj