
PF News: దేశవ్యాప్తంగా చాలా కాలం నుంచి ప్రావిడెండ్ ఫండ్ సంస్థ తన సభ్యుల కోసం సేవలను అప్ గ్రేడ్ చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా వారికి అనేక వెసులుబాట్లను కల్పిస్తూ.. గతంలో మాదిరిగా ఆలస్యాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్మును నేరుగా సభ్యులు తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే మే నెల చివర్లో లేదా జూన్ 2025లో పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బును యూపీఐ, ఏటీఎం ద్వారా పొందటానికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడైంది. తద్వారా గతంలో మాదిరిగా పీఎఫ్ ఖాతాలో సొమ్మును పొందటానికి ప్రజలు ఎక్కువ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సౌకర్యాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది.
ఇదే జరిగితే దేశంలోని లక్షల మంది పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. కొత్త విధానం కింద పీఎఫ్ ఖాతాదారులు ఏకకాలంలో గరిష్ఠంగా రూ.లక్ష వరకు తమ ప్రావిడెంట్ ఫండ్ మెుత్తాన్ని తీసుకోవటానికి అవకాశం ఉంటుందని లేబర్ మినిస్ట్రీ సెక్రటరీ సుమీతా దవారా వెల్లడించారు. దీనికి తోడు ఖాతాదారులు నేరుగా తమ యూపీఐ యాప్స్ ద్వారా పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలను కూడా తెలుసుకోగలరని ఆమె వెల్లడించారు. అక్కడి నుంచే వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు సదరు సొమ్మును విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీ అందించబడుతుందని చెప్పారు.
ALSO READ | Stock to Buy: 100% లాభం ఇవ్వనున్న స్టాక్.. రూపాయికి రూపాయి లాభం పక్కా..!
అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్ము కోసం ఎక్కువ కాలం వేచి ఉండకుండా కొత్త యూపీఐ విధానం అనుసంధానం ప్రజలకు నిధులను తక్షణం పొందటానికి అవకాశాన్ని అందిస్తుందని సుమితా వెల్లడించారు. ప్రస్తుతం మనందరికీ తెలుసు పీఫ్ సొమ్ము పొందాలంటే ఆన్ లైన్ దరఖాస్తు దానికి అనుమతి రావటం వంటి సుదీర్ఘ ప్రక్రియ అమలులో ఉంది. ఇందుకోసం కొన్ని సార్లు రోజుల నుంచి వారాల సమయం కూడా పడుతోందని తెలిసిందే.
EPFO సభ్యులు తమ PF పొదుపులను ఉపసంహరించుకోవడానికి అనుమతించే కారణాల జాబితాను కూడా పెంచాలని నిర్ణయించబడింది. వైద్య అత్యవసర పరిస్థితులతో పాటు, ఉద్యోగులు ఇప్పుడు గృహనిర్మాణం, విద్య, వివాహం వంటి ఇతర అవసరాలకు సైతం తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోగలరు. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ దాదాపు 120కి పైగా డేటాబేస్‌లను ఇంటిగ్రేట్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం దాదాపు 95 శాతం క్లెయిమ్స్ ఆటోమెటిక్ గా ప్రాసెస్ చేయబడుతుండగా దీనికి దాదాపు సగటున 3 రోజులు మాత్రమే గడువు పడుతోందని వెల్లడైంది.