హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విద్యార్థులు చదివే హాస్టల్స్‌ను బలోపేతం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం (డిసెంబర్ 14) సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్‌లోని రెసిడెన్షియల్ హాస్టల్లో కామన్ మెనూ డైట్ ఛార్జ్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు అందించే ఫుడ్ వివరాలు అడిగి తెలుసుకున్న ఉత్తమ్.. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు వారికి వడ్డీంచారు.
ALSO READ | స్వాతంత్య్రం తర్వాత ఇదే మొదటి సారి: విద్యార్థుల మెస్, కాస్మొటిక్ ఛార్జీలపై సీఎం రేవంత్
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మీతో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. హాస్టల్లో ఇన్వర్టర్, ల్యాబ్ రూమ్స్ , వింటర్ హిటర్ కావాలని అడిగారని.. వాటి కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే లక్ష్యంతో 16 ఏళ్ళ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులకు ఈ పెంచిన చార్జీలు వర్తిస్తాయన్నారు. విద్యార్థుల కోసం ప్రతి ఏడాది రూ.470 కోట్లు ఖర్చు చేయబోతున్నామని పేర్కొన్నారు. త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నామని తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు.