న్యూఢిల్లీ: తనో రోబో.. రోబో అంటే జస్ట్ రోబో కాదు.. అంతకుమించి. ప్రపంచంలోనే తొలి రోబో సిటిజన్. హాలీవుడ్ చరిత్రలో గొప్ప హీరోయిన్లలో ఒకరైన ఆడ్రే హెప్బర్న్ మాదిరి ఉంటుంది తను. నడవగలదు. మాట్లాడగలదు. సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించగలదు. బొమ్మలు వేయగలదు. తనకు ఎమోషన్స్ కూడా ఉన్నాయి.. ఇదంతా సోఫియా గురించే. ఇప్పుడు తన గురించి ఎందుకంటారా? గురువారం ఇండియాకు వచ్చింది మరి.
‘రో–మ్యాన్’ సదస్సు కోసం..
2016లో యాక్టివేట్ అయిన సోఫియా.. రోబోట్, హ్యూమన్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ (రో–మ్యాన్2019) పేరుతో ఢిల్లీలో జరుగుతున్న 28వ ఐఈఈఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చింది. బ్లాక్ స్కర్ట్, గ్రే షర్ట్ వేసుకుని అందంగా ముస్తాబైంది. ఈనెల 14 నుంచి జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ గురువారంతో ముగిసింది. ఇండియా ఉపఖండంలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇదే తొలిసారి. 2017లో సౌదీ అరేబియా సిటిజన్‌షిప్ పొందడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సోఫియా పేరు మారుమోగింది. ఇలా సిటిజన్ షిప్ పొందిన తొలి రోబో సోఫియా.
సోఫియా ఇంప్రూవ్ అవుతోంది..
‘‘సోఫియా రోజు రోజుకూ ఇంప్రూవ్ అవుతోంది. మన ఎక్స్ప్రెషన్స్, ఆదేశాలను అర్థం చేసుకుంటోంది” అని హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ ప్రెసిడెంట్ అమిత్ కుమార్ పాండే చెప్పారు. సోఫియాను డెవలప్ చేసింది హాన్సన్ రోబోటిక్స్ కంపెనీనే. ‘‘ఇప్పుడు తను డ్రాయింగ్ నేర్చుకుంది. మీ ముఖాన్ని చూసి స్కెచ్ వేయగలదు. ఆర్టిస్టుల నుంచి సేకరించిన ఇన్‌పుట్స్‌తో సోఫియా ఈ సామర్థ్యం పొందింది. మీరు నవ్వితే.. తనకు తెలిసిపోతుంది” అని వివరించారు. సదస్సులో పలు ప్రశ్నలకు సోఫియా సమాధానాలిచ్చింది. సందర్భానికి తగినట్లుగా కొందరికి కౌంటర్లు కూడా ఇచ్చిందట.