Sophie Devine: క్రికెట్‌కు విరామం.. RCB స్టార్ ఓపెనర్ సంచలన నిర్ణయం

Sophie Devine: క్రికెట్‌కు విరామం.. RCB స్టార్ ఓపెనర్ సంచలన నిర్ణయం

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్ తన నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచింది. కొంతకాలం ఆమె క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయిచుకుంది. ఈ విషయాన్ని శనివారం (జనవరి 25) న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.  దీంతో న్యూజిలాండ్ క్రికెట్ డివైన్ సేవలను కోల్పోనుంది. ఆమె ఎప్పుడు క్రికెట్ లోకి తిరిగి వస్తారో మాత్రం చెప్పలేదు. కేవలం న్యూజిలాండ్ లోనే కాదు మహిళా ప్రపంచ క్రికెట్ లో సోఫీ డివైన్ స్టార్ ఆటగాళ్లలో ఒకరు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఆమె ఎన్నో మ్యాచ్ ల్లో జట్టుకు విజయాలను అందించింది. 

డివైన్ క్రికెట్ కు దూరం కావడంతో డబ్ల్యూపీఎల్‌-2025 సీజన్‌ ఆరంభానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ జట్టు తరపున డివైన్ ఓపెనర్ గా ఆడుతుంది. ఆమె గత సీజన్ లో పెద్దగా రాణించలేదు. 2024 డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లో 10 మ్యాచ్ ల్లో 136 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ లో ఆరు వికెట్లు పడగొట్టింది. స్టార్ ప్లేయర్ కావడంతో ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్‌ చేసుకుంది. ఇక ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పెర్ఫార్మెన్స్ డెవలప్‌మెంట్ హెడ్ లిజ్ గ్రీన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ALSO READ | ILT20: క్రీడా స్ఫూర్తా..! తొక్కా..! ముంబై కోచ్‌ను తిట్టిపోస్తున్న అభిమానులు

డబ్ల్యూపీఎల్‌ మూడో సీజన్‌ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బరోడా వేదికగాగుజరాత్‌ జెయింట్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడనుంది. న్యూజిలాండ్  తరపున డివైన్ 152 వన్డే మ్యాచ్ లాడింది. 139 ఇన్నింగ్స్ ల్లో 3990 పరుగులు చేసింది. వీటిలో 8 సెంచరీలు 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 143 టీ20ల్లో 3391 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్ లో ఒక సెంచరీతో పాటు 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.