
- అధికారుల సమన్వయ లోపంతో ఆలస్యం
- దళారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. కోతలు మొదలైనప్పటికీ ఒకటి రెండు మినహా మిగతా చోట్ల కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ మద్దతు ధర రూ.3,371 ప్రకటించింది కానీ కొనుగోలు సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 78,323 ఎకరాల్లో జొన్న సాగు చేయగా 20 కొనుగోలు సెంటర్లను తెరవాలని అధికారులు నిర్ణయించారు కానీ ఇప్పటివరకు ఒకటి రెండు మాత్రమే ఓపెన్ చేశారు.
బ్లాక్ లిస్ట్ లో ఖేడ్ కేంద్రం
నారాయణఖేడ్ కందుల కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. మూడేళ్ల కింద ఈ కేంద్రంలో రైతుల నుంచి కాకుండా దళారుల నుంచి కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆ కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. దీనికి సంబంధించి అధికారులు క్లీన్ చిట్ ఇచ్చేవరకు ఖేడ్ కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ లిస్టు నుంచి తొలగించడం కుదరదని అధికార వర్గాలు తెలిపాయి.
జిల్లాలో జొన్న సాగు
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 78,323 ఎకరాల్లో జొన్న సాగు చేయగా సంగారెడ్డి సెగ్మెంట్లో 8,504 ఎకరాలు, జహీరాబాద్ లో 10,771, ఆందోల్ లో 14,272, నారాయణఖేడ్ లో 44,742 ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.3,371 ఉండగా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారులకు రూ.2,200కు అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన క్వింటాల్ కు రూ.1,171 నష్టపోవాల్సి వస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ రాయికోడ్ మండల కేంద్రంలో శుక్రవారం జొన్నల కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లాలో ఎక్కువగా హైబ్రిడ్ రకం కావడంతో ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. కానీ ఇక్కడ ఎకరాకు 8.64 క్వింటాళ్లే తీసుకుంటామని చెబుతున్నారు. గతేడాదిలో ఎకరాకు 14 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఈసారి ఎకరాకు 14 నుంచి 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఇలా..
జిల్లాలో డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీ, ఐకేపీ, ఎఫ్ పీవోల ద్వారా జొన్నలను కొనుగోలు చేయనున్నారు. డీసీఎంఎస్ ద్వారా నిజాంపేట్, సదాశివపేట, పీఏసీఎస్ ద్వారా ఝరాసంగం, ఏడాకులపల్లి, కొండాపూర్, బొక్కస్గమ్, మనూర్, కంగ్టి, బాచుపల్లి, మారేపల్లి, కడ్పల్ లో కొనుగోలు చేస్తున్నారు. సత్వర్ సొసైటీ ద్వారా ఏఎంసీ జహీరాబాద్, నల్లంపల్లి సొసైటీ ద్వారా ఏఎంసీ రాయికోడ్, చల్మెడ సొసైటీ ద్వారా మునిపల్లి, ఖాదీరాబాద్ సొసైటీ ద్వారా దేవునూర్ లో కొనుగోలు జరగనున్నాయి. ఐకేపీ ద్వారా మార్డి, కల్హేర్, సంజీరావుపేటలో, ఎఫ్ పీవో (పాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ద్వారా వాసర, నాగలిగిద్ద (సక్రు నాయక్ తండా)లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు.
కొనుగోలు కేంద్రాన్ని తెరవండి
నాకున్న 2 ఎకరాల్లో జొన్న పంట వేశా. పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రం అందుబాటులో లేదు. మూడేళ్లుగా మరో సెంటర్ కు పోయి అమ్ముకుంటున్నా. నారాయణఖేడ్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరవాలి. ఇక్కడ అధికారులు చేసిన తప్పిదానికి మేము నష్టపోతున్నాం. మరోచోటికి పోయి పంట అమ్మలంటే రవాణా ఖర్చులు భరించే శక్తి లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాం.
గణేశ్, రైతు, సత్యగామ