ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ ద్వారా జొన్నలు, రాగులు, సజ్జలు
- సబ్సిడీపైనే గోధుమపిండి, కందిపప్పు, చక్కెర
- రైతుల నుంచి నేరుగా జొన్నలు కొంటున్న అక్కడి సర్కారు
- అటు అన్నదాతలకు మేలు, ఇటు లబ్ధిదారులకు లాభం
ఖమ్మం, వెలుగు : వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ షాపుల్లో బియ్యం కావాలంటే బియ్యం, వద్దంటే జొన్నలు, లేదా రాగులు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాలు, గోధుమ పిండి, కంది పప్పు, చక్కెర.. ఇలా ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అది కూడా బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే సబ్సిడీపై తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో వీటిని రేషన్ షాపుల్లో అమలు చేస్తున్నారు. నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను రేషన్ కార్డుదారులకు బియ్యానికి బదులుగా ఉచితంగా సప్లయ్ చేస్తున్నారు.
దీని వల్ల ఒకవైపు పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు, వినియోగదారులకు కూడా మేలు జరుగుతోంది. ఏపీలో రేషన్ షాపుల ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ ద్వారా కేవలం బియ్యాన్ని మాత్రమే సప్లయ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో బియ్యం తప్ప అన్నీ బంద్..
రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. ప్రస్తుతం రేషన్ డీలర్ల ద్వారా లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పామాయిల్ ప్యాకెట్లు, కందిపప్పు, గోధుమలు, చక్కెర లాంటివి సప్లయ్ చేసినా, రాష్ట్ర విభజన తర్వాత వాటిని పూర్తిగా బంద్ పెట్టారు. రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ మంది సన్నబియ్యానికి అలవాటు పడడంతో రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని బయట కిలోకు రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. ఈ బియ్యం వివిధ మార్గాల్లో మళ్లీ మిల్లులకే చేరుతుండగా, తిరిగి ఆ బియ్యాన్నే సీఎంఆర్ కింద రేషన్ షాపులకు పంపుతున్నారు. ఈ రీ సైక్లింగ్ దందాలో మిల్లర్లు, దళారులే కోట్లకు పడగలెత్తుతుండగా, సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. మరోవైపు ప్రజల్లో ఆరోగ్య స్పృహ నానాటికీ పెరుగుతోంది. చాలా మంది బియ్యం బదులు జొన్న రొట్టెలు, మిల్లెట్స్ తింటున్నారు. పౌష్టికాహారంలో భాగంగా తరుచూ పప్పులు తీసుకోవాలని డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు. పబ్లిక్ జొన్నలు, మిల్లెట్స్, పప్పులు తినేందుకు సిద్ధంగా ఉన్నా సర్కారు మాత్రం బియ్యం మాత్రమే సప్లై చేస్తుండడంతో వాటిని తినలేక అమ్ముకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో లక్ష నుంచి లక్షన్నర ఎకరాల్లో జొన్న, సుమారు ఏడు నుంచి పది లక్షల ఎకరాల్లో కంది పండుతున్నా, వాటిని వ్యాపారులకు అడ్డికి పావుశేరు అమ్ముకోవాల్సి వస్తోంది. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా సకాలంలో పంట కొనకపోవడం, కొనే పంటపై ఆంక్షలు విధించడంతో అన్నదాతలు నష్టపోతున్నారు. ఈసారి జొన్నలకు రూ.2900కి పైగా కనీస మద్దతు ధర ఉన్నా, ప్రైవేట్ వ్యాపారులకు రూ.1800, 1900 లోపే రేటుకు అమ్ముకున్నారు.
గతేడాది రెండు సీజన్లలో కలిపి మన రాష్ట్రంలో సుమారు 30 లక్షల టన్నుల జొన్న దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇందులో మెజార్టీ పంటను రైతుల నుంచి ప్రభుత్వం నేరుగా కొని, రేషన్ షాపుల ద్వారా సప్లయ్ చేస్తే వినియోగదారులతో పాటు రైతులకు కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో సర్కారు ప్రోత్సహిస్తే మిల్లెట్స్ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అలా పండిన పంటను సేకరించి, సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేస్తే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరగనుంది. ఈ దిశగా రాష్ట్ర సర్కారు ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏపీలో ప్రయోగాత్మకంగా పంపిణీ..
ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో రేషన్ కార్డు ద్వారా ఉచితంగా రెండు కిలోల బియ్యానికి బదులుగా జొన్నలు, రాగులు తీసుకోవచ్చు. మన్యం జిల్లాలతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కిలో గోధుమపిండి ప్యాకెట్ ని రూ.16 చొప్పున అమ్ముతున్నారు. ఒక్కో రేషన్ కార్డుపై రెండు కిలోల చొప్పున గోధుమ పిండి తీసుకోవచ్చు. కిలో కంది పప్పును రూ.67కు, అరకిలో షుగర్ ను రూ.17 కు రేషన్ కార్డు దారులకు సబ్సిడీపై అందజేస్తున్నారు. గత సీజన్ లో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన జొన్నలను వినియోగదారులకు పంపిణీ చేస్తున్న అక్కడి సర్కారు, రాగులను కర్ణాటక నుంచి కొనుగోలు చేసి మరీ అందజేస్తోంది. వీలైనంత ఎక్కువగా రాష్ట్రంలోనే చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించి త్వరలోనే ఇక్కడ కొనుగోలు చేస్తామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. రాగులకు క్వింటాకు రూ.3846 చొప్పున కనీస మద్దతు ధర కూడా ప్రకటించారు.
త్వరలోనే అన్ని గ్రామాల్లో గోధుమపిండి రేషన్ ద్వారా పంపిణీ చేస్తామని అంటున్నారు. మిగిలిన చిరు ధాన్యాలను కూడా దశలవారీగా రాష్ట్రం మొత్తం రేషన్ ద్వారా పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. భారత్ చొరవతో 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి మిల్లెట్ ఇయర్ గా ప్రకటించడంతో చిరు ధాన్యాల వినియోగాన్ని చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీలోనూ రేషన్ ద్వారా సప్లయ్ ను ప్రారంభించామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఇక ఏపీలో రేషన్ ను ప్రత్యేక వాహనాల్లో నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సప్లయ్ చేస్తున్నారు.