
ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ వంటివి ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. డబ్బుపై వ్యామోహంతో అమాయకులు తమకు తెలియకుండానే బెట్టింగ్, పేకాటకు వ్యసనపరులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
యువత వీటి బారిన పడకుండా అప్రమత్తం చేయాల్సిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు.. డబ్బు కోసం వాటిని ఆడమని ప్రోత్సహిస్తున్నారు. నిమిషాల్లో లక్షలు, కోట్లు సంపాదించవచ్చని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్లపై కొన్ని రోజుల క్రితం ఐపీఎస్ అధికారి సజ్జనార్ సీరియస్ అయ్యారు. యువతను ఆన్‌లైన్ పందాలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నాని వెనక్కి తగ్గాడు. బెట్టింగ్ ప్రమోట్ చేయడానికి తాను చదువుకోకపోవడమే ప్రధాన కారణమని తెలిపాడు. ఇతరులను చూసి.. అది నిజమని నమ్మి వీడియోలు చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించాడు. భవిష్యత్తులో ఇటువంటి మరోసారి పునరావృతం అవ్వదని మాటిచ్చాడు. ఇతర ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇటువంటి వీడియోలు చేయొద్దని కోరాడు. అందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ రీపోస్ట్ చేశారు.
ఇక మీదట ఆన్ లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేయనని ప్రకటించిన నానిని సజ్జనార్ అభినందించారు. మిగతా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇకనైనా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు ఆపమని కోరారు. కాదు, కూడదు 'మేం అలానే చేస్తాం. మా ఇష్టం' అనుకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.