
- బాల్క సుమన్కే ఓటేసి గెలిపిస్తామని మహిళలతో ప్రమాణం
- భీమారంలో ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించిన రూలింగ్ పార్టీ లీడర్లు
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో రూలింగ్ పార్టీ లీడర్లు ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు వార్డుల వారీగా సౌండ్ బాక్స్ లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం మహిళల నుంచి ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. సౌండ్ బాక్స్ లపై బీఆర్ఎస్ లీడర్ చెరుకు సరోత్తమ్ రెడ్డి పేరిట స్టిక్కర్లు అంటించి అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా మహిళలతో చెన్నూర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ 'బాల్క సుమన్ కు ఓటేసి గెలిపిద్దాం.. అభివృద్ధికి పట్టం కడుదాం' అని ప్రమాణం చేయిస్తున్నారు. వాస్తవానికి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పార్టీల పేరుతో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదు. కానీ భీమారంలో అధికార పార్టీ నాయకులు కోడ్ ను ఉల్లంఘించి మహిళలకు సౌండ్ బాక్సులు పంపిణీ చేయడం, ఆధార్ కార్డులు సేకరించడం, సుమన్ ను గెలిపించాలని ప్రమాణం చేయించడం వివాదాస్పదంగా మారింది.
ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. అధికార పార్టీకి కోడ్ వర్తించదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై చెన్నూర్ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) ఎస్.దత్తును వివరణ కోరగా.. పార్టీల పేరుతో కానుకలు పంపిణీ చేయడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేశారు. భీమారంలో సౌండ్ బాక్సులు పంపిణీ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, స్పెషల్ టీమ్ తో ఎంక్వయిరీ చేయిస్తున్నామని ఆయన తెలిపారు.