యూట్యూబర్‎పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దాదా.. అసలేం జరిగిందంటే..?

యూట్యూబర్‎పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దాదా.. అసలేం జరిగిందంటే..?

కోల్‎కతా: సోషల్ మీడియాలో తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన యూట్యూబర్ మృణ్మోయ్ దాస్‎పై భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదా తరుఫున ఆయన కార్యదర్శి తానియా భట్టాచార్య దాస్‌పై కోల్‌కతా సైబర్ క్రైమ్ విభాగంలో ఆన్‌లైన్ కంప్లైంట్ ఇచ్చారు. 

మృణ్మోయ్ దాస్ అనే యూట్యూబర్ సౌరవ్ గంగూలీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, గంగూలీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు హాని కలిగించే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదా కార్యదర్శి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. వీడియోలను పరిశీలించి తదుపరి యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.

అసలేం జరిగిందంటే..? 

కోల్‎కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‎లో ఓ జూనియర్ డాక్టర్‎పై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా  సంచలన సృష్టించిన ఈ ఘటనపై గంగూలీ స్పందించారు. ‘‘ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. యాదృచ్ఛికంగా ఒక ఆసుపత్రిలో విషాదం జరిగింది. అందువల్ల ప్రతిచోటా సరైన ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది’’ అని దాదా వ్యాఖ్యానించాడు. అయితే జూడా హత్యాచార ఘటనపై గంగూలీ చేసిన కామెంట్స్ మిస్ ఫైర్ అయ్యారు. 

యాదృచ్ఛికం, ముందు జాగ్రత్తగా ఉండాలంటూ దాదా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే  గంగూలీ వ్యాఖ్యలపై యూట్యూబర్ మృణ్మోయ్ దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో దాదాకు వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేశాడు.  సౌరవ్ గంగూలీ బతికి ఉన్నప్పుడే అతనిపై బయోపిక్ అవసరమా అని.. అసభ్యపదజాలతో దూషించాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.