Sourav Ganguly: రోహిత్‌ను కెప్టెన్‌గా చేసింది నేనే.. ఇప్పుడు నన్నెవరూ తిట్టడం లేదు: గంగూలీ

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత లెజెండరీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనను విమర్శించినవారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. భారత జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంపై తాను ఎదుర్కొన్న విమర్శలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ సారధ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని.. విమర్శకులకు కౌంటర్ విసిరాడు. బెంగాలీ దినపత్రిక 'ఆజ్‌కాల్'తో మాట్లాడుతూ రోహిత్ ను కెప్టెన్ గా చేసిన తన నిర్ణయం సరైనదేనని సమర్ధించుకున్నారు. 

“నేను రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్ గా చేసినప్పుడూ అందరూ నన్ను విమర్శించారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకుంది. అప్పుడు నన్ను విమర్శించిన వారు ఇప్పుడు తిట్టడం మానేశారు. రోహిత్ శర్మను కెప్టెన్ గా చేసింది నేనే అనే సంగతి అందరూ మర్చిపోయారు". అని సౌరవ్ గంగూలీ అజ్కాల్‌తో చెప్పారు. 

దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కోహ్లీ కెప్టెన్సీలో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న గంగూలీ.. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలని పట్టు పట్టాడు. టీ20ల తో పాటు వన్డే ఫార్మాట్ కు సైతం హిట్ మ్యాన్ కెప్టెన్ గా ఉండాలని గంగూలీ సూచించారు. 

గంగూలీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించారనే వార్తలు వచ్చాయి. దీంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఈ సమయంలో గంగూలీపై అభిమానులు మండిపడ్డారు. కోహ్లీని తప్పించాడని అతడిపై ట్రోలింగ్ కు దిగారు. అయితే తాజాగా టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలవడంతో తన నిర్ణయం సరైనదేనని తనను విమర్శించిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.