
టీమిండియా ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టును ఓడించాలంటే ఏ జట్టుకైనా సవాలే. 9 నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టైటిల్స్ గెలిచిన టీమిండియా భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యం లేదు. బెంచ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. రానున్న 10 సంవత్సరాలు భారత క్రికెట్ జట్టు సేఫ్ జోన్ లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన భారత్.. ఆ తర్వాత వరుసగా టీ20 వరల్డ్ కప్.. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్స్ గెలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఊపు మీదున్నప్పటికీ అంతకముందు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్.. స్వదేశంలో న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ కావడం ఆందోళన కలిగించే విషయాలు. ఈ రెండు సిరీస్ లలో బ్యాటర్ల వైఫల్యమే కారణం. ఈ సిరీస్ ఓటములతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియాకు తిరుగులేకపోయినా రెడ్ బాల్ క్రికెట్ లో మాత్రం తడబడుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత టెస్ట్ క్రికెట్ బ్యాటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత స్టార్ బ్యాటర్లు టెస్ట్ క్రికెట్‌లో తమ గేమ్ ను మెరుగు పరుచుకోవాలని గంగూలీ సూచించాడు.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు. "మన జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నాకున్న ఏకైక ఆందోళన ఏమిటంటే విరాట్, యశస్వి తప్పమిగిలిన ఆటగాళ్లకు విదేశాలలో యావరేజ్ 40 కంటే ఎక్కువ లేదు. జైస్వాల్ స్వదేశంలో ఆడిన తొమ్మిది టెస్టుల్లో 44.18 యావరేజ్ తో స్కోర్ చేశాడు. మరోవైపు కోహ్లీ విదేశాల్లో 66 టెస్టుల్లో సగటున 41.51 గా ఉంది. రాహుల్, శుభ్‌మాన్ గిల్, పంత్ వంటి వారు తమ బ్యాటింగ్ ను పరిశీలించుకోవాలి. మంచి టెస్ట్ జట్టుగా ఎదగాలనుకుంటే.. టాప్ 6 బ్యాటర్లలో ముగ్గురు లేదా నాలుగురు ఆటగాళ్ల సగటు 50కి దగ్గరగా ఉండాలి. గిల్ నాణ్యమైన టెస్ట్ క్రికెట్ ఆడుతూ తన బ్యాటింగ్ ను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి". అని గంగూలీ రెవ్‌స్పోర్ట్జ్‌లో అన్నాడు.