రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ వద్దన్నాడు.. సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ వద్దన్నాడు.. సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎంత గ్రేట్ కెప్టెన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఐపీఎల్ లోనే కాదు భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా రెండు సార్లు ఆసియా కప్ లు గెలిచింది. ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతన్న వరల్డ్ కప్ లోనూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ గెలిచి టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ లో మొదటి 100 మ్యాచ్ లు ఆడిన కెప్టెన్ల లిస్ట్ తీస్తే రోహిత్ 74 శాతం విజయాలతో టాప్ లో ఉన్నాడు. అయితే హిట్ మ్యాన్ అసలు కెప్టెన్సీ వద్దని చెప్పాడని గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

గంగూలీ మాట్లాడుతూ "రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మూడు ఫార్మాట్లలో ఆడటంలో తీవ్ర ఒత్తిడి ఉంటుందని అతడి ఆలోచన. ఒక దశలో నేను రోహిత్ ను కెప్టెన్సీ చేయమని అడిగా. లేదంటే నేను బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పా. విరాట్ కోహ్లి తర్వాత టీమ్ ఇండియాను నడిపించడానికి రోహిత్ శర్మనే తగిన వ్యక్తి. అయితే ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం టీమిండియాను ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుతం. ఫలితాలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారుగా.    అంటూ సౌరవ్ గంగూలీ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

 సాధారణంగా ఇండియా కెప్టెన్ అనగానే ఎవరైనా వెంటనే తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ రోహిత్ మాత్రం విముఖత చూపించడంతో కెప్టెన్సీ అంటే ఎంత ఒత్తిడి ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. భారత క్రికెట్ కెప్టెన్ అంటే గెలిస్తే ఎంత గౌరవం ఉంటుందో ఓడిపోతే ఎంత దిగ్గజ ఆటగాడైనా విమర్శలు తప్పవు. బహుశా ఈ విషయం హిట్ మ్యాన్ ముందుగానే గ్రహించాడేమో.