IND vs SA Final: ఫైనల్ ఓడిపోతే రోహిత్ బార్బడోస్ సముద్రంలోకి దూకుతాడు: గంగూలీ

IND vs SA Final: ఫైనల్ ఓడిపోతే రోహిత్ బార్బడోస్ సముద్రంలోకి దూకుతాడు: గంగూలీ

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాలను సాధిస్తుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో హిట్ మ్యాన్ కు తిరుగులేకుండా పోతుంది. ఫార్మాట్ ఏదైనా తనదైన కెప్టెన్సీతో జట్టును ఫైనల్ కు చేరుస్తున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ ద్వారా తొలిసారి సారధ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్.. తొలి ప్రయత్నంలోనే జట్టును సెమీస్ కు చేర్చాడు. 2023 టెస్ట్ ఛాంపియన్ షిప్.. ఇదే ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. తాజాగా విండీస్, అమెరికా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ హిట్ మ్యాన్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 

జట్టు ప్రతిసారి నాకౌట్ సమరానికి వచ్చినా టైటిల్ అందించడంలో రోహిత్ విఫలమవుతున్నాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ వరుసగా ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోవడం జీర్ణించుకోలేని విషయం. అప్పటిదాకా అత్యుత్తమ ఆటతీరును చూపించి ఫైనల్లో చేతులెత్తేస్తున్నారు. అయితే 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశం వచ్చింది. శనివారం (జూన్ 29) సౌతాఫ్రికాతో 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ ఫైనల్ ఫైట్ కు   ముందు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రోహిత్ పై చేసిన కామెంట్స్ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. 

“రోహిత్ శర్మ ఏడు నెలల వ్యవధిలో రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌ ఓడిపోతాడని నేను అనుకోను. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్‌లో ఓడిపోతే అతను బహుశా బార్బడోస్ సముద్రంలోకి దూకుతాడు. జట్టును రోహిత్ ముందుండి నడిపించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇదే జోరు ఫైనల్లో కొనసాగుతుందని ఆశిస్తున్నాను. పెద్ద టోర్నీలు గెలవాలంటే కొంచెం అదృష్టం కావాలి. భారత్ కు ఈ మ్యాచ్ లో అదృష్టం వరిస్తుందేమోనని భావిస్తున్నాను. అని గంగూలీ అన్నాడు.