IND vs PAK: ఐసీసీ ఈవెంట్స్ కూడా వద్దు.. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలపై బీసీసీఐకి గంగూలీ విజ్ఞప్తి

IND vs PAK: ఐసీసీ ఈవెంట్స్ కూడా వద్దు.. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలపై బీసీసీఐకి గంగూలీ విజ్ఞప్తి

మంగళవారం (ఏప్రిల్ 22) పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను అయినా వదులుకోవాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ప్రతి సంవత్సరం భారత గడ్డపై ఏదో ఒక ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతాయని.. ఇకపై ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని టీమిండియా మాజీ కెప్టెన్ అన్నారు. 

పాకిస్తాన్‌తో ఇండియా తన క్రికెట్ సంబంధాలన్నింటినీ తెంచుకోవాలని.. ఈ క్రమంలో ఐసీసీ, ఆసియా టోర్నమెంట్లలో కూడా పాక్ జట్టుతో మ్యాచ్ లు ఆడకూడదనే తన అభిప్రాయాన్ని బలంగా చెప్పుకొచ్చారు. గంగూలీ మాట్లాడుతూ "100 శాతం పాకిస్థాన్ తో ఇండియా అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలి. ఉగ్రవాదంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాంటివి జరుగుతుండటంతో ఈ విషయాన్ని తమాషాగా తీసుకోకూడదు. ఉగ్రవాదాన్ని సహించేది లేదు". అని సౌరవ్ గంగూలీ విలేకరులతో అన్నారు.

►ALSO READ | IPL 2025: ఐపీఎల్ కోసం హనీమూన్‌ వద్దనుకున్న సన్ రైజర్స్ మ్యాచ్ విన్నర్

పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధం తర్వాత.. బీసీసీఐ పాకిస్తాన్ తో ఇక నుంచి క్రికెట్ మ్యాచులు ఆడేది లేదని స్పష్టం చేసింది. తటస్థ వేదికలపైన కూడా పాక్ తో మ్యాచ్ లు ఆడేది లేదని.. ఖరాఖండీగా తేల్చి చెప్పింది. ఐసీసీ నిర్వహించే సిరీస్ ల విషయంలో ఆడాలా వద్దా అనేది.. భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుందని.. ప్రభుత్వం అనుమతి ఇస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటోంది బీసీసీఐ. ఐసీసీ ఈవెంట్స్ లోనూ పాకిస్థాన్, ఇండియాను ఒకే గ్రూప్ లో ఉండకుండా చూడాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. 

ఇండియా, పాక్‌‌ క్రికెట్‌‌ ఫీల్డ్‌‌లో తలపడితే చూడాలని ప్రపంచమంతా కోరుకుంటుంది. కానీ ఈ రెండు జట్ల మధ్య ఇకపై క్రికెట్ చూడడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. చివరిసారిగా 2012లో పాకిస్థాన్ భారత్ లో పర్యటించింది. 2008 లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్ లో పర్యటిచింది. 2012 తర్వాత ఇరు జట్లు ఐసీసీ ట్రోఫీలో మాత్రమే తలబడుతున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగనుంది. ఈ పర్యటనకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.