కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ MP టికెట్!

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్ సభ టికెట్ ను సీఎం కేసీఆర్ కన్ ఫామ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

త్వరలోనే చేవెళ్లలో టీఆర్ఎస్ ఓ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలోనే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు టీఆర్ఎస్ లో చేరబోతున్నారని తెలిసింది. ఈ సభలోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కార్తీక్ రెడ్డి పేరును ప్రకటిస్తారని సమాచారం.

తాము టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతామన్న విషయం కేసీఆర్ నిర్ణయిస్తారని కార్తీక్ రెడ్డి చెప్పారు. త్వరలోనే చేవెళ్లలో ఓ బహిరంగ సభ ఉంటుందన్నారు. కేసీఆర్ ని కలిసాక పార్టీ మార్పుపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించిందని కార్తీక్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ అభివృద్ధికి తీసుకోవలసిన చాలా అంశాలపై చర్చించామన్నారు కార్తీక్ రెడ్డి.