టీ20 వరల్డ్ కప్ 2024 లో వెస్టిండీస్ వేదికగా జరుగుతుంది అనగానే ఆతిధ్య విండీస్ జట్టు టైటిల్ ఫేవరేట్ గా మారిపోయింది. పవర్ హిట్టర్లు ఉండడం.. సొంతగడ్డపై టోర్నీ జరగడంతో కరీబియన్ జట్టుకు తిరుగులేదనుకున్నారు. అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8 కు అర్హత సాధించిన వెస్టిండీస్.. ఆ తర్వాత తేలిపోయింది. సెమీస్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పోరాడి ఓడిపోయింది. సోమవారం (జూన్ 24) సౌతాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో విండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ టోర్నీల్లో కొన్నేళ్లుగా విండీస్ దారుణంగా ఆడుతుంది. 2016 లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. 2023లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపాయింది. ఇక్కడ నుంచి విండీస్ పతనం మొదలయింది. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే లాంటి జట్ల చేతిలో వెస్టిండీస్ ఘోర పరాజయాలను చవిచూడటంతో ఈ టోర్నీలో చోటు సంపాదించలేకపోయింది. ఒకప్పుడు తిరుగులేని జట్లుగా పేరొందిన వెస్టిండీస్ కనీసం వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో సొంతగడ్డపై కంబ్యాక్ ఇవ్వాలనుకున్నా కుదరలేదు.
వెస్టిండీస్ పతనానికి దారితీసిన కారణాల గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటే.. స్టార్ ఆటగాళ్లను తయారు చేయడంలో వెస్టిండీస్ విఫలమైందని చెప్పాలి. ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లకు ఎగబాకిన నికోలస్ పూరన్.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షిమ్రాన్ హెట్‌మేయర్ లాంటి క్రికెటర్లు టీ20 లీగ్‌లలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ అలాంటి ఆటగాళ్లలో ఫామ్ నిలకడగా లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. 2014లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కి, ఆటగాళ్లకు మధ్య జరిగిన వాగ్వాదం, మేనేజ్‌మెంట్‌తో చెల్లింపు వెస్టిండీస్ క్రికెట్ జట్టును అర్థికంగా కూడా కిందపడేసిందని చెప్పవచ్చు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం135 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కైల్ మేయర్స్(35), రోస్టన్ చేజ్(52)లు మాత్రమే రాణించారు. ఆ తర్వాత వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారి జట్టు.. 16.1ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 6 పాయింట్లతో సౌతాఫ్రికా సెమీస్‌కు చేరింది.