అదే జోరు.. అదే తెగింపు.. అదే ఆత్మవిస్వాసం వెరసి వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గెలుపు సంగతి పక్కన పెడితే సఫారీలు భారీ తేడాతో గెలుస్తున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ మెగా టోర్నీకి ముందు అండర్ డాగ్ గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అంచనాలను మించి ఆడుతుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగో మ్యాచ్ లో మూడు విజయాలు సాధించిన సఫారీలు తాజాగా బంగ్లాను చిత్తు చేసి నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 140 బంతుల్లోనే 174 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్లాసన్ 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 49 బంతుల్లోనే 90 పరుగులు చేస్తే.. మిల్లర్ 15 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ తో 34 పరుగులు చేసాడు. కెప్టెన్ మార్కరం 60 పరుగులు చేసాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమ్మద్ రెండు వికెట్లు తీసుకోగా.. షకీబ్, షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హాసన్ మిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనలో బంగ్లా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ 233 పరుగులకు ఆలౌటైంది. ఏ ఒక్కరు కూడా కనీస ప్రదర్శన చేయలేకపోయారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్దుల్లా వీరోచిత శతకం(111) చేసినా అది బంగ్లా విజయానికి ఏ మాత్రం సరిపోలేదు. సఫారీ బౌలర్లలో కొయెట్జ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రబడా, జాన్సెన్, విలియమ్స్ కి తలో రెండు వికెట్లు దక్కగా మహారాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు