భారత జట్టు దక్షణాఫ్రికా పర్యటన చివరి దశకు చేరుకుంది. ఈ టూర్ లో ఇక ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ మిగిలివుండగా.. విజయంతో సఫారీ పర్యటన ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండు టెస్టుల సిరీస్‍లో 0-1తో వెనుకబడింది. దీంతో రెండో టెస్టులో విజయం సాధిస్తే తప్ప సిరీస్ కాపాడుకోలేరు. ఈ తరుణంలో గెలుపు కోసం భారత ఆటగాళ్లు నెట్స్ లో చెమటలు చిందిస్తున్నారు.
జనవరి 3 నుంచి న్యూల్యాండ్స్ వేదికగా భారత్, దక్షణాఫ్రికా రెండో టెస్టు జరగనుంది. ఈ క్రమంలో పిచ్ ఎలా ఉండనుంది..? మ్యాచ్ టైమింగ్స్ ఏంటి..? తుది జట్లు ఎలా ఉండున్నాయనే వివరాలు తెలుసుకుందాం..
లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్స్
రెండో టెస్టు స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. అదే డిజిటల్ విషయానికి వస్తే.. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ యాప్ లో వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
వర్షం లేదు.. ఆడితేనే గట్టేక్కేది
వాతావరణ నివేదికల ప్రకారం.. రెండో టెస్టుకు వర్షం అంతరాయం లేదు. ఐదు రోజుల పూర్తి ఆటను ఆస్వాదించవచ్చు. ఇక పిచ్ విషయానికొస్తే.. పిచ్ పై పచ్చిక ఉండనుంది. దీంతో పేసర్లు ప్రభావం చూపనున్నారు. మొదటి మూడు రోజులు పేసర్లు.. చివరి రెండు రోజులు స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించవచ్చు.
మార్పులు చేర్పులు
వెన్ను నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే, తొలి టెస్టులో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్ తుది జట్టులో స్తానం దక్కించుకోవచ్చు. మరోవైపు గాయం కారణంగా టెంబా బవుమా దూరమవ్వడంతో డీన్ ఎల్గర్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్.
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రమ్, టోనీ డీ జోర్జీ, కీగన్ పీటర్సన్, జుబైర్ హంజా, డేవిడ్ బెడిన్‍గమ్, కేల్ వెర్రియన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, లుంగీ ఎంగ్డీ, కగిసో రబాడ, నాడ్రే బర్గర్.