IND vs SA: నేడు రెండో టీ20.. అభిషేక్‌‌‌‌ శర్మ పైనే అందరి దృష్టి

IND vs SA: నేడు రెండో టీ20.. అభిషేక్‌‌‌‌ శర్మ పైనే అందరి దృష్టి
  • నేడు సౌతాఫ్రికాతో ఇండియా రెండో టీ20
  • టీమిండియా టాపార్డర్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌
  • రా. 7.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌–18, జియో సినిమాలో లైవ్‌‌‌‌

గెబెహా: తొలి టీ20 విజయంతో జోరుమీదున్న యంగ్‌‌‌‌ టీమిండియా.. సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో స్పష్టమైన ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. అయితే ఇది జరగాలంటే ఇండియా టాపార్డర్‌‌‌‌లో మరింత స్థిరత్వం రావాలి. తొలి మ్యాచ్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ షో ముందు తేలిపోయిన మిగతా కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్‌‌‌‌లో బ్యాట్లు ఝుళిపించాలి. ముఖ్యంగా యంగ్‌‌ ఓపెనర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ శర్మ ఫామ్‌‌‌‌పై ఆందోళన కొనసాగుతోంది. జింబాబ్వేపై హాఫ్‌‌‌‌ సెంచరీ తర్వాత అభిషేక్‌‌‌‌ ఆడిన ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో 0, 10, 14, 16, 15, 4, 7 రన్స్‌‌‌‌ మాత్రమే చేశాడు. ఒకవేళ టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో అతన్ని కొనసాగించాలంటే ఈ పెర్ఫామెన్స్‌‌‌‌ ఏమాత్రం సరిపోదు. 

ఈ మ్యాచ్‌‌‌‌కు తుది జట్టులో మార్పులు చేసే చాన్స్‌‌‌‌ లేదు కాబట్టి అభిషేక్‌‌‌‌కు ఇది ఆఖరి అవకాశంగానే చెప్పొచ్చు. తెలుగు బ్యాటర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ జట్టులో ప్లేస్‌‌‌‌ను సుస్థిరం చేసుకోవాలంటే భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉంది. పేపరు మీద బలంగా కనిపిస్తున్న ఇండియా మిడిలార్డర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో తేలిపోతున్నది. కేవలం 36 రన్స్‌‌‌‌కే చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ప్రతికూలాంశం. దీనిపై టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సీరియస్‌‌‌‌గా దృష్టి పెట్టాల్సి ఉంది. కెప్టెన్‌‌‌‌ సూర్యకు మెరుగైన ఆరంభం దక్కినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా పరిస్థితి కూడా ఇదే. ఈ ఇద్దరు మ్యాచ్‌‌‌‌లో గాడిలో పడాల్సిందే. ఫినిషర్‌‌‌‌గా రింకూ సింగ్‌‌‌‌ ప్రభావం కనిపించడం లేదు. బౌలింగ్‌‌‌‌లో ఇండియాకు ఇబ్బందుల్లేవు. స్పిన్నర్లు వరుణ్‌‌‌‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం  శుభసూచకం. బలమైన సౌతాఫ్రికా లైనప్‌‌‌‌ను కట్టడి చేయాలంటే పేసర్లు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ కూడా చెలరేగాలి. అదే జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఇండియా విజయం కష్టమే కాబోదు. 

లెక్క సరిచేస్తారా?

టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనలే అనుకుంటే సిరీస్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లోనూ ఓడటం సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా దెబ్బతీసింది. దీంతో రెండో మ్యాచ్‌‌‌‌ లో గెలిచి లెక్క సరిచేయాలని చూస్తోంది. అయితే అనుభవజ్ఞులైన డికాక్‌‌‌‌, రబాడ, అన్రిచ్‌‌‌‌ నోర్జ్‌‌‌‌, షంసిలాంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం ప్రొటీస్‌‌‌‌కు మైనస్‌‌‌‌గా మారింది. టాపార్డర్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. హార్డ్‌‌‌‌ హిట్టర్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌ బాధ్యతలకు తోడుగా క్రుగెర్‌‌‌‌, యాన్సెన్‌‌ కూడా స్పష్టమైన ప్రభావాన్ని చూపెట్టాలి. బ్యాటింగ్‌‌‌‌తో పోలిస్తే ప్రొటీస్‌‌‌‌ బౌలింగే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. స్టార్టింగ్‌‌‌‌లో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ను చివర్లో అద్భుతంగా కట్టడి చేశారు. కోయెట్జీ, యాన్సెన్‌‌, కేవశ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌, పీటర్‌‌‌‌, క్రుగెర్‌‌‌‌ అంచనాలను అందుకున్నారు. ఇదే జోరును రెండో టీ20లోనూ  కొనసాగించాలని భావిస్తున్నారు. 

జట్లు (అంచనా)

ఇండియా : శాంసన్‌‌‌‌, అభిషేక్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), తిలక్‌‌‌‌ వర్మ, హార్దిక్‌‌‌‌ పాండ్యా, రింకూ సింగ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ / రమణ్‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, వరుణ్‌‌‌‌ చక్రవర్తి. 

సౌతాఫ్రికా : మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రికెల్టన్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌, మిల్లర్‌‌‌‌, క్రుగెర్‌‌‌‌, యాన్సెన్‌‌, సిమిలెన్‌‌‌‌, కోయెట్జీ, కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌, పీటర్‌‌‌‌ / బార్ట్‌‌‌‌మన్‌‌‌‌.