T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా

T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి సౌతాఫ్రికా దూసుకెళ్లింది. గురువారం (జూన్ 27) జరిగిన ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన సెమీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో సౌతాఫ్రికా ఫైనల్ కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు సంచలన ఆటతీరుతో సెమీస్ లోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ లో తేలిపోయింది. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగే సెమీ ఫైనల్ విన్నర్ తో శనివారం (జూన్ 27) ఫైనల్లో తలబడుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా వికెట్  కోల్పోయి 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. 

57 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాపై గొప్ప ఆరంభం లభించలేదు. 4 పరుగులు చేసిన డికాక్ రెండో ఓవర్లో ఫజల్ ఫారూఖీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఈ దశలో కెప్టెన్ మార్కరంతో ఓపెన్ హేన్డ్రిక్స్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. చిన్నగా బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికాకు విజయాన్ని అందించారు. హేన్డ్రిక్స్(29), మార్కరం (23) నాటౌట్ గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ కు ఒక వికెట్ దక్కింది. 

కుదేలైన ఆఫ్ఘనిస్తాన్

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌(10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నబీ (0), జనత్‌ (8), నూర్ ఆహ్మద్‌ (0), నవీనుల్‌ హక్‌ (2), కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8)లు దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు.