- బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా భారీ విజయం
- దుమ్మురేపిన క్లాసెన్, మార్‌క్రమ్
- మహ్మదుల్లా సెంచరీ వృథా
- రాణించిన సఫారీ బౌలర్లు
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (174) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 382 పరుగుల భారీ స్కోరు చేయగా.. బంగ్లాదేశ్ 233కే కుప్పకూలింది.
ముంబై: కెరీర్‌లో ఆఖరి వరల్డ్ కప్ ఆడుతున్న క్వింటన్ డికాక్ (140 బాల్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174) మరోసారి పరుగుల సునామీ సృష్టించాడు. ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీతో దుమ్మురేపాడు. హెన్రిచ్ క్లాసెన్ (49 బాల్స్‌లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90) కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో అండగా నిలవడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 149 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని అందుకుంది. టాస్ నెగ్గిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 383/5 స్కోరు చేసింది. , మార్‌క్రమ్ (60) రాణించాడు. తర్వాత బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 రన్స్‌కు ఆలౌటైంది.
మహ్మదుల్లా (111 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 111) సెంచరీ చేసినా ప్రయోజనం దక్కలేదు. ప్రొటీస్ బౌలర్ల క్రమశిక్షణ ముందు బంగ్లా బ్యాటింగ్ లైనప్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. కోయెట్జీ (3/62), మార్కో జెన్‌నెస్ (2/39), లిజాద్ విలియమ్స్ (2/56), రబాడ (2/42) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ బంగ్లాను కట్టడి చేశారు. లిటన్ దాస్ (22), నాసుమ్ అహ్మద్ (19)తో సహా అందరూ విఫలమయ్యారు. డికాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
దంచుడే.. దంచుడు
స్లో పిచ్‌పై ఆరంభంలోనే సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో 7, 8 ఓవర్లలో వరుసగా హెండ్రిక్స్ (12), డుసెన్ (1) ఔటయ్యారు. దీంతో ప్రొటీస్ 36/2తో కష్టాల్లో పడింది. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన డికాక్ ఆ తర్వాత గేర్ మార్చాడు. బంగ్లా పేస్, స్పిన్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. రెండో ఎండ్‌లో మార్‌క్రమ్ సింగిల్స్ తీస్తూ ఎక్కువగా డికాక్‌కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న అతను 101 బాల్స్‌లోనే సెంచరీ బాదాడు. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు వాయువేగంతో పరుగెత్తింది.
ఈ క్రమంలో మూడో వికెట్‌కు 131 రన్స్ జోడించి మార్‌క్రమ్ వెనుదిరిగినా తర్వాత వచ్చిన క్లాసెన్ పెను విధ్వంసం సృష్టించాడు. లాంగాన్, లాంగాఫ్, మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్లు దంచాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న డికాక్ కూడా బ్యాటు ఝుళిపించడంతో దాదాపు 20 ఓవర్ల పాటు పరుగుల వరద పారింది. 46వ ఓవర్‌లో హసన్ మహ్మద్ (2/67).. డికాక్‌ను ఔట్ చేసి రన్స్ వర్షానికి అడ్డుకట్ట వేశాడు. నాలుగో వికెట్‌కు 142 (87 బాల్స్) రన్స్ జత కావడంతో సౌతాఫ్రికా స్కోరు 300లు దాటింది. చివర్లో మిల్లర్ (34 నాటౌట్) అండగా క్లాసెన్ ఎదురుదాడిని కొనసాగించాడు. మిల్లర్‌తో 65 రన్స్ జోడించి ఔటయ్యాడు. ఓవరాల్‌గా చివరి 10 ఓవర్లలో 144 రన్స్ రావడంతో సఫారీలు భారీ టార్గెట్‌ను నిర్దేశించారు. వరల్డ్ కప్ చరిత్రలో హయ్యెస్ట్ ఇండివిడ్యువల్ స్కోరు చేసిన తొమ్మిదో ప్లేయర్‌గా డికాక్ రికార్డులకెక్కాడు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 50 ఓవర్లలో 382/7 (డికాక్ 174, క్లాసెన్ 90, మార్‌క్రమ్ 60, హసన్ మహ్మద్ 2/67). బంగ్లాదేశ్: 46.4 ఓవర్లలో 233 ఆలౌట్ (మహ్మదుల్లా 111, కోయెట్జీ 3/62, జెన్‌సెన్ 2/39).