2024 T20 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్‌పై సందిగ్ధత.. బార్బడోస్‌ చేరని దక్షిణాఫ్రికా జట్టు

2024 T20 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్‌పై సందిగ్ధత.. బార్బడోస్‌ చేరని దక్షిణాఫ్రికా జట్టు

టీ20 వరల్డ్ కప్ 2024 లో సౌతాఫ్రికా అంచనాలకు మించి రాణిస్తోంది. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకుంది. దీంతో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన సఫారీ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. ఫైనల్ సమరానికి సిద్ధమైంది. టీమిండియాతో శనివారం (జూన్ 29) ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. బార్బడోస్‌లోని  కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే ఈ నగరానికి చేరుకున్నారు. అయితే సౌతాఫ్రికా జట్టు మాత్రం ఇంకా బార్బడోస్ కు చేరుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ కు ఒక రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. బార్బడోస్‌ వేదికగా జరగనున్న ఈ నగరానికి సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంకా చేరుకోలేదట. ఆరు గంటలుగా ట్రినిడాడ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రొటీస్‌ క్రికెటర్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ కోసం బార్బడోస్‌కు ఎప్పుడు చేరుకుంటారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఒకవేళ రేపటికల్లా సౌతాఫ్రికా బార్బడోస్ చేరుకోకపోతే ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు కొత్త ఆందోళనకు దారి తీస్తోంది.

అసలేం జరిగిందంటే..?

బార్బడోస్ గ్రాంట్లీ ఆడమ్స్ విమానాశ్రయంలో ఒక చిన్న ప్రైవేట్ విమానం ల్యాండింగ్ విఫలమవడంతో మొత్తం రన్‌వే మూసివేసినట్టు తెలుస్తోంది. దీని వలన ఏ ఫ్లైట్‌ అక్కడ దిగేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ట్రినిడాడ్‌ విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చినట్లు నివేదికలు వస్తున్నాయి. సఫారీ జట్టుతో సహా వారి కుటుంబసభ్యులు, కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులు, ఐసీసీ అధికారులు ట్రినిడాడ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారని సమాచారం. వీలైనంత త్వరగా రన్ వేని క్లియర్ చేసేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నట్లు గ్రాంట్లీ ఆడమ్స్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.

గత ప్రపంచకప్‌లకు భిన్నంగా

సాధారణంగా టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆదివారం నిర్వహిస్తారు. అయితే, వెస్టిండీస్ లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో శనివారమే మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాకపోతే రిజర్వ్ డే(జూన్ 30, ఆదివారం) మ్యాచ్‌ను నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు.