
కరాచీ: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సౌతాఫ్రికా.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్–బి టాపర్‌గా సెమీస్ చేరుకుంది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో వాండర్ డసెన్ (72 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (64), నిలకడగా ఆడటంతో.. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 రన్స్‌కే ఆలౌటైంది. జో రూట్ (37) టాప్ స్కోరర్. కొత్త బాల్‌తో పేసర్ మార్కో జాన్సెన్ (3/39) ఇంగ్లిష్ టాపార్డర్‌ను బెంబేలెత్తించాడు.
వియాన్ ముల్డర్ (3/25), స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (2/35)కూడా దెబ్బకొట్టారు. ఫిల్ సాల్ట్ (8), జెమీ స్మిత్ (0), లివింగ్‌స్టోన్ (9) నిరాశ పరచగా.. బెన్ డకెట్ (24), ఆర్చర్ (25), బట్లర్ (21), హ్యారీ బ్రూక్ (19) కాసేపు ప్రతిఘటించారు. ఎంగిడి, రబాడ చెరో వికెట్ తీశారు. తర్వాత సౌతాఫ్రికా 29.1 ఓవర్లలో 181/3 స్కోరు చేసి నెగ్గింది.
స్టబ్స్ (0) డకౌటైనా, రికెల్టన్ (27) ఫర్వాలేదనిపించాడు. డసెన్‌తో రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించి ఔటయ్యాడు. 47/2 వద్ద వచ్చిన క్లాసెన్.. డసెన్‌కు అండగా నిలిచాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 127 రన్స్ జత చేసి విజయాన్ని అందించారు. మూడు వికెట్లు తీసి మూడు క్యాచ్‌లు పట్టిన జాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. న్యూజిలాండ్, ఇండియా మధ్య చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సౌతాఫ్రికా మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో పోటీ పడనుంది.