భారత దౌత్య నీతికి దక్షిణాసియా సవాళ్లు

కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ ఎనిమిదేండ్లలో భారత విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు, సాధించిన విజయాలు, చేసుకోవాల్సిన దిద్దుబాట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొదటగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైబర్​హుడ్ ఫస్ట్ పాలసీ, మారుతున్న దక్షిణాసియా యవనికలో చైనా పాత్ర, భారత్ చేపడుతున్న కార్యక్రమాల గురించి మొదట చర్చించుకోవాలి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 లో నైబర్​హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా దక్షిణాసియాలోని దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇండియా బంగ్లాదేశ్ కు మధ్య 2015లో కుదిరిన ల్యాండ్ బోర్డర్ అగ్రిమెంట్ ముఖ్యమైనది. ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత 40 ఏండ్లకుపైగా నలుగుతున్న అపరిష్కృత ఎన్​క్లేవ్ లను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. రెండు దేశాలు ఒక సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించుకున్నట్లయింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ లోని వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపురలో ఉన్న 92 బంగ్లాదేశ్ ఎన్​క్లేవ్స్, ఆ దేశంలోని103 ఇండియన్ ఎన్​క్లేవ్స్ ను, వాటిల్లో నివసిస్తున్న సుమారు 51 వేల మంది ప్రజలను పరస్పర మార్పిడి చేసుకున్నాయి. 

బీబీఐఎన్​ కూటమి ఏర్పాటు..

పాకిస్తాన్ లాంటి పొరుగుదేశంతో ఏర్పడిన సమస్యల కారణంగా సార్క్ ప్రక్రియ ముందుకు సాగలేదు. దానికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్(బీబీఐఎన్​) ఉపప్రాంతీయ సహకార కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. దాని కింద ఆయా దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచేందుకు కావాల్సిన కనెక్టివిటీ అభివృద్ధి చేయడానికి, వాహన రాకపోకలను అనుమతించేందుకు 2015లో మోటార్ వెహికల్ అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పటికే ఇండియాకు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లతో విద్యుత్ వ్యాపారం జరుగుతోంది. ఈ మొత్తం ప్రాంతాన్ని పారిశ్రామికీకరణకు, ఉద్యోగ కల్పనకు, గ్రామీణ విద్యుదీకరణకు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన సమస్యల నుంచి బయటకు లాగేందుకు ఉద్దేశించిన ఈ ప్రయత్నం చాలా బృహత్తరమైనది. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను కేంద్రంగా చేసుకొని సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీస్ తో భౌగోళిక సాన్నిహిత్యాన్ని పెంచుకునేందుకు ఉద్దేశించిన కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లో భాగంగా ‘యాక్ట్ ఈస్ట్ త్రో నార్త్ ఈస్ట్’ విధానాన్ని 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రవేశపెట్టింది. ఈ వ్యూహంలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుపాక్షిక స్థాయిల్లో, ప్రజలమధ్య ఉన్న సాంస్కృతిక, చారిత్రక, సామాజిక, రక్షణ సంబంధాలను పునరుత్తేజితం చేయడంతో పాటు, సమష్టితత్వం పెంపొందించే చర్యలను చేపట్టారు. ఇవి ఒక వైపు ఈ ప్రాంతాన్నంతటిని ఒకటిగా చేయడంతో పాటు రోజు రోజుకు పెరిగి పోతున్న చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

చైనా ప్రాజెక్టులతో..

మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ పేరుతో యురేషియా, ఆఫ్రికా, ఓషియానియా ప్రాంతాలతో చైనా ను కలిపే బృహత్తర ప్రాజెక్ట్ లను చేపట్టింది. చైనా పెట్టుబడులతో, టెక్నాలజీతో, ముడి సరుకులతో చేపట్టిన ఈ ప్రణాళికలు భారత్ కు అనేక సవాళ్లు విసిరాయి. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం, భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలతో సంబంధాలను ఈ ఓబీఆర్​తర్వాత బీఆర్​ఐ తీవ్రంగా ప్రభావితం చేశాయని, దక్షిణాసియాలో సరికొత్త పోటీకి తెరతీశాయి. 2013  నుంచి 2019 మధ్యకాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్, మాల్దీవులు లాంటి పొరుగు దేశాలు బీఆర్ఐ ప్రాజెక్ట్ లో చేరడం భారత్ ను తీవ్రంగా కలవర పరిచాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ లో చైనా సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా, అతిపెద్ద ఎగుమతిదారుగా, వ్యాపార భాగస్వామిగా అవతరించింది. ఆ దేశంలోని మొత్తం గ్యాస్ ఉత్పత్తిలో 50 శాతం కన్నా ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి చైనా కంపెనీల అధీనంలోని గ్యాస్ ప్లాంట్ల నుంచి జరుగుతున్నదే. గత రెండు మూడేండ్లుగా నేపాల్ కు అందుతున్న విదేశీ పెట్టుబడుల్లో 70  శాతం కన్నా ఎక్కువగా చైనా నుంచి వస్తున్నవే. ఈ దేశాలు ఏటా సుమారు 4 బిలియన్ డాలర్లకు పైగా చైనా నుంచి పెట్టుబడులు, ఆర్థిక సాయం పొందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాసియాతో పాటు బంగాళాఖాతం తీరప్రాంత దేశాల్లో చైనా ప్రాబల్యాన్ని నిలువరించడం భారత్ కు అంత తేలిక కాదు. దాంతో పాటు నేపాల్, మాల్దీవులు, శ్రీలంక లాంటి దేశాల్లో భారత వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, అవి మన ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలు తీసుకోవడం నైబర్​హుడ్ ఫస్ట్ పాలసీపై ప్రశ్నలు లేవనెత్తాయి.  

సాగర మాల ప్రాజెక్టుతో అనుసంధానం..

ఇప్పటికే చైనా ఈ ప్రాంతంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో భాగంగా వివిధ దేశాల్లో చేపట్టిన రోడ్, పోర్ట్ అభివృద్ధి పనులు ఒకవైపు, మారిటైం సిల్క్ రోడ్ లో భాగంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో చేపట్టిన పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ తో ముందుకు వెళ్తోంది. మరోవైపు ఇండియా పట్ల అనుసరిస్తున్న ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ స్ట్రాటజీ’ని ఎదుర్కోవాలంటే యాక్ట్ ఈస్ట్ పాలసీతో పాటు మరింత విస్తృతమైన ప్రణాళిక అవసరమని భావించిన ఇండియా 2015లో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్(సాగర్) అనే స్ట్రాటజీని చేపట్టింది. దాని ప్రకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని హిందూ మహాసముద్ర తీర పొరుగు దేశాలతో ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాలను పటిష్టం చేసుకోవడం. భారత్ వీటికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి సాయం చేస్తుంది. అయితే భారత్ కు ఆయా రంగాల్లో లోతైన అవగాహన, నైపుణ్యం ఉన్నప్పటికీ, ఆర్థిక వనరుల కొరత కారణంగా ఈ ప్రాజెక్టులు అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. దీంతో దాన్ని దేశానికి ఉన్న సుమారు 7500  కిలోమీటర్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్ట్ తో అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు ఆరు లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో 2015లో ప్రారంభించిన సాగరమాల ప్రాజెక్ట్  తీరప్రాంత పారిశ్రామికీకరణ, ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో సముద్ర ఆధారిత బ్లూ ఎకానమీకి ఊతం ఇస్తుంది. ఇప్పటికే సుమారు లక్ష కోట్ల విలువైన దాదాపు194 ప్రాజెక్ట్స్ ను ఈ పథకం కింద పబ్లిక్  ప్రైవేట్ పార్ట్​నర్​షిప్​ ద్వారా పూర్తి చేశారు. 2035 వరకు ప్రతిపాదించిన మొత్తం పనులు పూర్తయ్యేలా, తద్వారా భారత్ ను10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించారు. 

తెరపైకి బీమ్​స్టెక్

2017లో జపాన్ భాగస్వామ్యంతో ప్రతిపాదించిన ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ద్వారా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ తీరప్రాంత దేశాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మౌలిక వసతులు అనుసంధానించేందుకు ప్రణాళికలు రచించినప్పటికీ, కరోనా లాంటి కారణాలతో అవి అంత ముందుకు సాగలేదు. 1997లోనే ప్రారంభించినప్పటికీ బంగాళాఖాతం సభ్య దేశాల మధ్య సహకారం కోసం చేపట్టిన, అంతగా ముందుకు సాగని ప్రయత్నంగా మిగిలిపోయిన బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ -సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్(బీమ్​స్టెక్​) ఈ సందర్భాంగా, సార్క్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మొన్న మార్చిలో జరిగిన ఐదో శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల మధ్య బీమ్​స్టెక్​ పరస్పర సహకారంతో ప్రాంతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, వస్తు రూపేణా ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు సాయం చేసి, వాటిలో భారత్ పట్ల తిరిగి సద్భావన కలిగించడం ఒక అవకాశం అయితే, వాటి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని చైనా తన పరిధిని మరింత విస్తరించకుండా అడ్డుకోవడం ఇండియా ముందు ఉన్న సవాలు.
- డా. గద్దె ఓంప్రసాద్
  ఎనలిస్ట్, ఇంటర్నేషనల్​ ఎఫైర్స్​​