
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) 2023-–-24 ఆర్థిక సంవత్సరంలో 144.140 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి13,825 కోట్ల ఆదాయాన్ని రాబట్టిందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో 141.120 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో అంత కంటే 2శాతం ఎక్కువగా సరుకును రవాణా చేశామని చెప్పారు. సరుకు రవాణా ద్వారా జోన్ 2023–24లో 13,620 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగా గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024–25లో రూ.13,825 కోట్ల ఆదాయాన్ని రాబట్టామని పేర్కొన్నారు. అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు వివరించారు. జోన్లో ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే నూతన పంథాలను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.
సరుకు రవాణాలో వినియోగదారులను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, సరుకు రవాణా టెర్మినల్స్‌లో పని వాతావరణం, గూడ్స్ షెడ్‌లను మెరుగుపర్చడం మొదలైన వాటితో సామర్థ్యాన్ని పెంపొందించినట్టు తెలిపారు. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే లోని ఆపరేషన్స్, కమర్షియల్ బృందం చేసిన కృషిని జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే వేగాన్ని కొనసాగించాలని వారికి సూచించారు.