
- మద్యం తాగిన ప్రయాణికులను పట్టుకునేందుకు బ్రీత్ అనలైజర్లు
- ఉన్నతాధికారులతో సమావేశంలో జీఎం అరుణ్‌కుమార్‌జైన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు:సబర్బన్రైళ్లలో ప్రయాణించే వారి రక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఎంఎంటీఎస్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించగా, ఆమె రైలు నుంచి దూకింది. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల కంపార్ట్‌మెంట్లు, ఎమ్ఎమ్ టీఎస్ రైళ్లలో ఎక్కువ మంది మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సిబ్బంది ఉండేట్టు చూడాలన్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో, అర్ధరాత్రి, తెల్లవారుజామున ఆర్పీఎఫ్, జీఆర్పీ గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలిపేందుకు ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు అన్ని రైళ్ల మహిళా కోచ్‌లలో, కీలక ప్రదేశాలలో అత్యవసర ఫోన్ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు.
పానిక్బటన్స్ కూడా..
మహిళల భద్రత కోసం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పర్యవేక్షణతో అన్ని కంపార్ట్‌మెంట్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జీఎం ఆదేశించారు. ప్రతి మహిళా కోచ్‌ను కంట్రోల్ రూమ్ తో పాటు రైలు గార్డుకు అనుసంధానం చేసి.. సులభంగా యాక్సెస్ చేసే పానిక్ బటన్లను అమర్చాలన్నారు. మద్యం సేవించినట్టు కనిపించే ప్రయాణికులకు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి ఆర్పీఎఫ్ సిబ్బందికి బ్రీత్ అనలైజర్లను అందజేయాలని నిర్ణయించారు.
రైల్వే స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా క్రమం తప్పకుండా అవగాహన ప్రచారాలను చేపట్టడం, రైల్వే ప్రాంగణంలో పోస్టర్‌లను ఏర్పాటుచేయడం, అనుమానాస్పద వ్యక్తులను గమనించినప్పుడు ఎలా స్పందించాలనే అంశంపై అవగాహన కల్పించేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని అందించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటరి మహిళా ప్రయాణీకులు ప్రయాణించే కోచ్‌లపై మరింత నిఘా ఉంచాలని జీఎం ఆదేశించారు.