దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
సికింద్రాబాద్, వెలుగు: వచ్చే వానాకాలాన్ని దృష్ట్యా రైళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్అరుణ్కుమార్జైన్ పేర్కొన్నారు. భారీ వర్షాలు పడ్డప్పుడు, గాలులు వీచేటప్పుడు సిబ్బంది స్టేషన్లలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైళ్ల సమయపాలనను పర్యవేక్షించాలని సూచించారు. వానాకాలంలో రైళ్ల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు వంటి సిబ్బందికి భారీ వర్షాలు పడేటప్పుడు, గాలులు వీచేటప్పుడు అనుసరించాల్సిన విధానాలపై రెగ్యులర్ గా కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. జోన్ లో పొగను గుర్తించే పరికరాలు, అగ్నిమాపక యంత్రాలు తదితర భద్రత సంబంధిత నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికా రులు జనరల్ మేనేజర్ కు వివరించారు.
రైళ్లను సురక్షితంగా నడిపేందుకు మెయింటెనెన్స్ లకు హాజరవుతున్నప్పుడు తీసుకోవాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలను పాటించాలని డీఆర్ఎంలను ఆదేశించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్ , విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.